
1.4 కోట్ల పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది.
న్యూఢిల్లీ: క్లౌడ్ సర్వీసుల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి దీని ద్వారా 1.4 కోట్ల పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. క్లౌడ్ విభాగానికి భారత్ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 380 బిలియన్ డాలర్ల వాటా ఉండగలదని ఒక ప్రకటనలో వెల్లడించింది.
క్లౌడ్ వినియోగంతో పౌరులకు సేవలు మెరుగుపర్చవచ్చని, డిజిటల్ మాధ్యమం ద్వారా అందరికీ వైద్యం, విద్య, ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవచ్చని తెలిపింది. అలాగే దేశీయంగా నవకల్పనలకు ఊతం, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాల రూపంలో తోడ్పాటు లభించగలదని నాస్కామ్ తెలిపింది.
అన్ని వర్గాల నుంచి సహకారం లభిస్తే వచ్చే అయిదేళ్లలో క్లౌడ్‌పై వెచ్చించే నిధులు 25–30 శాతం పెరిగి 18.5 బిలియన్ డాలర్లకు చేరగలవని వివరించింది. తద్వారా క్లౌడ్ అవకాశాలను భారత్ పూర్తి సామర్ధ్యంతో వినియోగించుకోగలదని నాస్కామ్ పేర్కొంది.