
హోమ్ అప్లయెన్స్ కంపెనీల నిర్ణయం
కొత్త ధరలు సోమవారం నుంచి అమల్లోకి..
న్యూఢిల్లీ: గృహోపకరణాల దిగ్గజ సంస్థలు జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) రేట్లను రూ.4,500 వరకు, డిష్‌వాషర్ల ధరలను రూ.8,000 వరకు తగ్గించాయి. కొత్త ధరలు సెప్టెంబర్ 22(సోమవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఏసీల తయారీ కంపెనీలు రూమ్ ఎయిర్ కండీషనర్లతో పాటు వాణిజ్య సముదాయాల్లో వినియోగించే వీఆర్‌ఎఫ్ ఏసీలు, స్ల్పిట్ ఏసీలు, టవర్ ఏసీలపై కూడా ధరలు తగ్గించాయి.
వోల్టాస్, డైకిన్, గోద్రెజ్ అప్లయెన్సెస్, పానసోనిక్, హైయర్ తదితర ప్రముఖ బ్రాండ్లు తగ్గింపు ధరలతోనే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించాయి. ప్రతిపాదిత జీఎస్‌టీ రేట్ల కోతతో పండుగ సీజన్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్‌టీ సంస్కరణల్లో కేంద్రం ఏసీలు, డిష్‌వాషర్లపై జీఎస్‌టీ 28% నుంచి 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
→ గోద్రెజ్ అప్లయెన్సెస్ లైట్ కమర్షియల్, టవర్ ఏసీల ధరలను రూ.8,550 నుంచి రూ.12,450 వరకు తగ్గిస్తోంది. స్ల్పిట్ ఏసీ ఇన్వర్టర్ మోడళ్ల ధరలు రూ.3,200 – 5,900 మేర తగ్గుతాయి.
→ హైయర్ కంపెనీ తన గ్రావిటీ (1.6 టన్నుల ఇన్వర్టర్)ఏసీలపై రూ.3,905, అలాగే కినౌచీ ఏసీ మోడల్ (1.5 టన్నులు, 4 స్టార్ రేటింగ్)పై రూ.3,202 తగ్గిస్తోంది.
→ వొల్టాస్ కంపెనీ ఫిక్స్‌డ్ స్పీడ్ విండో ఏసీ ధరలు రూ.42,990 నుంచి రూ.39,590కి, ఇన్వర్టర్ ఇండో ఏసీ ధరలు రూ.46,990 నుంచి రూ.43,290కి తగ్గించింది.
→ జపాన్ చెందిన డైకిన్ సంస్థ 5 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ ధర (1 టన్ను) రూ.20,500 నుంచి రూ.18,890కు, అలాగే 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ ధర రూ.73,800 నుంచి రూ.68,020కు, 1.8 సామర్థ్యం కలిగిన ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ ధర రూ.92,200 నుంచి రూ.84,980కు దిగివచ్చాయి. ఇదే కంపెనీ 3 స్టార్ రేటింగ్ కలిగిన ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ(1 టన్ను సామర్థ్యం) ధరలను రూ.50,700 నుంచి రూ. 46,730కు, 1.5 సామర్థ్యం కలిగిన హాట్‌అండ్‌కోల్డ్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ ధర రూ.61,300 నుంచి రూ.56,500 కు తగ్గించింది.
→ ఎల్‌జీ ఎల్రక్టానిక్ ఎంట్రీ లెవల్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ(టన్ను సామర్థ్యం) ధరలపై రూ.2,800 తగ్గించింది. 1.5 టన్ను సామర్థ్యం కలిగిన ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ ధరలపై రూ.3,600, రెండు టన్నుల సామర్థ్యం కలిగిన స్ల్పిట్ ఏసీలపై రూ.4,400 ధరను తగ్గించింది.
→ పానసోనిక్ ఇండియా 1.5 టన్ను విండో ఏసీ ధరల శ్రేణి 45,650 – 49,990 నుంచి రూ.42,000 – 46,000కి దిగిరానుంది. అలాగే ఫిక్స్‌డ్ స్పీడ్ స్ల్పిట్ ఏసీ(టన్ను సామర్థ్యం)లపై రూ.3700, రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలపై రూ.5,500 వరకు తగ్గించింది.
డిష్ వాషర్ల ధరలు ఇలా
బీఎస్‌హెచ్ హోమ్ అప్లయెన్సెస్ రూ.8,000 వరకు తగ్గించింది. సెప్టెంబర్ 22 నుంచి ఎంట్రీ లెవల్ డిష్‌వాషర్ రూ.49,000 నుంచి రూ.45,000కు, టాప్–ఎండ్ మోడల్ రూ.104,500 నుంచి రూ.96,500కు దిగిరానుంది. అలాగే వొల్టాస్ బెకో ఎంట్రీలెవల్ డిష్‌వాషర్ల ధరలు రూ.25,990 నుంచి రూ.23,390కు తగ్గనున్నాయి.