యూనికార్న్‌ల నిపుణుల వేట

10 Companies abow Unicorn Staff recruitment - Sakshi

అర్బన్‌ కంపెనీ, భారత్‌పే వంటి సంస్థల్లో నియామకాలు

టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌ తదితర విభాగాల్లో అవకాశాలు

రూ.5 కోట్ల దాకా ప్యాకేజీలు

బెంగళూరు: ఇన్వెస్టర్ల నుంచి పుష్కలంగా వస్తున్న నిధుల ఊతంతో యూనికార్న్‌లుగా (100 కోట్ల డాలర్ల వేల్యుయేషన్‌ గలవి) ఎదిగిన దేశీ స్టార్టప్‌ సంస్థలు ప్రస్తుతం కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకోసం భారీగా నిపుణులను నియమించుకునే ప్రయత్నా ల్లో ఉన్నాయి. వివరాల్లోకి వెడితే.. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 23 స్టార్టప్‌ సంస్థలు యూనికార్న్‌ హోదాను దక్కించుకున్నాయి.

వీటిల్లో దాదాపు పది పైగా కంపెనీలు తాము భారీగా సిబ్బందిని రిక్రూట్‌ చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలిపాయి. అప్‌గ్రాడ్, మొగ్లిక్స్, బ్రౌజర్‌స్టాక్, జెటా, ఎరుడైటస్, ఫార్మ్‌ఈజీ, భారత్‌పే, గప్‌షప్, మీషో, అర్బన్‌ కంపెనీ, డ్రూమ్, డిజిట్‌ ఇన్సూరెన్స్, కాయిన్‌డీసీఎక్స్, క్రెడ్‌ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నా యి. కొత్త ఉత్పత్తులను ఆవిష్కరణ, విభిన్న విభాగాల్లోకి ప్రవేశంతో స్టార్టప్‌లు సిబ్బందిని పెంచుకోవాల్సి వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఎరుడైటస్‌లో వెయ్యి.. అప్‌గ్రాడ్‌లో 1,500.. ఇటీవలే యూనికార్న్‌ క్లబ్‌లో చేరిన ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ సంస్థ ఎరుడైటస్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా 1,000 మంది సిబ్బందిని తీసుకునే ప్రణాళికల్లో ఉంది. ఏటా తమ వ్యాపారం సుమారు 2.75 రెట్లు వృద్ధి చెందుతోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్ట్రక్షన్‌ డిజైన్, పాఠ్యాంశాల రూపకల్పన, మార్కెటింగ్, స్టూడెంట్‌ సపోర్ట్‌ వంటి విభాగాల్లో కీలక సిబ్బందిని నియమించుకోనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు, ఎడ్‌టెక్‌ రంగానికే చెందిన అప్‌గ్రాడ్‌ కూడా తమ దేశ, విదేశ కార్యకలాపాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 1,500 మంది పైగా ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకోవాలని భావిస్తోంది.

కార్యకలాపాలు విస్తరిస్తుండటం, కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తుండటం తదితర అంశాలు ఇందుకు కారణమని సంస్థ వర్గాలు తెలిపాయి. క్రెడిట్‌ కార్డ్‌ బిల్‌ చెల్లింపు సేవల సంస్థ క్రెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమ సిబ్బంది సంఖ్యను 40% మేర పెంచుకోవాలని భావిస్తోంది. ఫార్మ్‌ఈజీ, భారత్‌పే, మీషో, అర్బన్‌ కంపెనీ, కాయిన్‌డీసీఎక్స్, డ్రూమ్‌ మొదలైన సంస్థలు సుమారు 1,000 మందిని నియమించు కోనున్నాయి. క్లౌడ్‌ వెబ్, మొబైల్‌ టెస్టింగ్‌ ప్లాట్‌ఫాం బ్రౌజర్‌స్టాక్‌ రాబోయే 18 నెలల్లో భారత్, అమెరికా, ఐర్లాండ్‌ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకోనుంది. గప్‌షప్‌ 300 మందిని రిక్రూట్‌ చేసుకోవడం ద్వారా తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది.

భారీ ప్యాకేజీలు...
నిపుణులకు డిమాండ్‌ పెరిగే కొద్దీ వారి వేతన ప్యాకేజీలూ పెరుగుతున్నాయి. ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్స్‌ (ఎసాప్స్‌)తో పైస్థాయిలో రూ. 5 కోట్లకు మించి ప్యాకేజీలు ఉంటున్నాయి. మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం గప్‌షప్‌ లాంటి సంస్థలు ఇచ్చే ప్యాకేజీలో జీతాలు, బోనస్‌లు, స్టాక్‌లు భాగంగా ఉంటున్నాయి. ఇటీవల నిధులు సమీకరించిన నేపథ్యంలో ఉద్యోగులు తమ షేర్లను కంపెనీకి తిరిగి విక్రయించే అవకాశం కల్పించినట్లు గప్‌షప్‌ వర్గాలు తెలిపాయి. తాము కూడా తరచూ ఎసాప్‌ బైబ్యాక్‌ల ద్వారా ఉద్యోగుల సంపద వృద్ధికి తోడ్పడుతున్నట్లు క్రెడ్‌ పేర్కొంది.

ఇక డిమాండ్‌లో ఉన్న ఉద్యోగాల విషయానికొస్తే .. ప్రోడక్ట్, టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, కస్టమర్‌ సపోర్ట్, సేల్స్, కంటెంట్, డిజైన్, ఆపరేషన్స్‌ టీమ్‌ మొదలైన విభాగాల్లో నిపుణుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఫార్మ్‌ఈజీ తమ ఇంజినీరింగ్, ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌ విభాగాల్లో సీనియర్‌ సిబ్బందిని రిక్రూట్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అటు భారత్‌పే తమ స్ట్రాటెజీ, అనలిటిక్స్, టెక్నాలజీ, ఉత్పత్తులు, కార్పొరేట్‌ సేవల బృందాలు మొదలైన విభాగాల్లో నియామకాలు చేపడుతోంది. అర్బన్‌ కంపెనీ ప్రధానంగా డిజైన్, రిసెర్చి సహా పలు విభాగాల్లో ఇంజినీర్లను తీసుకుంటోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top