సూపర్‌బజార్(కొత్తగూడెం): పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్, జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ గత జూన్ 29న ఇదే అంశంపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తోగ్గూడెం అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం జరుగుతోందన్నారు. సహజ వనరులు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. మైనింగ్ శాఖ అధికారులు తోగ్గూడెం ప్రాంతంలోని క్వారీలను మూడుసార్లు సీజ్ చేశారని, ప్రతీ సారి కొద్దిరోజులపాటు మాత్రమే సీజ్ చేసి తిరిగి తవ్వకాలు కొనసాగేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. తవ్వకాల పరిమాణాన్ని నమోదు చేయకుండా తక్కువగా చూపించి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని తగ్గిస్తున్నారని అన్నారు. సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలకు వాస్తవాలను దాచిపెట్టి అన్ని క్వారీలకు అనుమతులు ఉన్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లావుడ్యా వెంకటేష్, బోడ రమేష్, బానోత్ నాగరాజు, బాదావత్ సురేష్ నాయక్, జర్పుల లాలు, బట్టు హుస్సేన్, బోడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట సేవాలాల్‌సేన ధర్నా


