విద్యార్థికి విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థికి విజ్ఞానం

Jul 26 2026 12:15 AM | Updated on Jul 26 2026 12:15 AM

● ‘వీవీఎం’ పేరుతో ప్రతిభా అన్వేషణ పరీక్ష ● 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు అవకాశం ● విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు ● జాతీయస్థాయిలో సత్తా చాటితే ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ కూడా.. సద్వినియోగం చేసుకోవాలి

రిజిస్ట్రేషన్‌, ఇతర వివరాలు..

ఇంటర్న్‌షిప్‌లు–భాస్కర స్కాలర్‌షిప్‌

● ‘వీవీఎం’ పేరుతో ప్రతిభా అన్వేషణ పరీక్ష ● 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు అవకాశం ● విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు ● జాతీయస్థాయిలో సత్తా చాటితే ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ కూడా..

ఖమ్మంసహకారనగర్‌: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ), నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియమ్స్‌ (ఎన్‌సీఎస్‌ఎం), విజ్ఞాన భారతి సంయుక్త ఆధ్వర్యాన ‘విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ (వీవీఎం) జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష నిర్వహించనుంది. విద్యార్థుల్లో శాసీ్త్రయ పరిజ్ఞానం పెంపొందించడం, పరిశోధనలపై ఆసక్తి పెంచడమే ఈ పరీక్ష ప్రధాన లక్ష్యం. విజేతలకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో బహుమతులు అందించడమే కాక మెరుగైన ప్రతిభ చాటిన వారికి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌నకు అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం ‘వీవీఎం’ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యాన ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తే మేలు జరగనుంది.

ఎవరెవరు అర్హులు

దేశవ్యాప్తంగా 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్ష రాసేందుకు అర్హులే. ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్‌ ఓపెన్‌ బుక్‌ విధానంలో నిర్వహిస్తారు. తద్వారా ఇంటి నుంచే మొబైల్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌ ద్వారా పరీక్ష రాయొచ్చు. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌, హిందీతో పాటు మొత్తం 14 భారతీయ భాషల్లో ఉంటుంది.

సైన్స్‌పై ఆసక్తి పెంపే లక్ష్యం

విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడం, భారతీయ శాస్త్రవేత్తల కృషిని పరిచయం చేయడమే ఈ పరీక్ష లక్ష్యం. అంతేకాక ఉన్నత విద్యకు మార్గనిర్దేశం చేస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేలా పరీక్ష నిర్వహిస్తున్నారు. పరిశోధనా సంస్థలతో పరిచయం కల్పించే లక్ష్యంతో సాగుతున్నారు.

పరీక్ష విధానం

లెవల్‌ – 1 (స్కూల్‌ స్థాయి) పరీక్ష 100 ప్రశ్నలతో 90 నిమిషాల సమయం ఉంటుంది. మొదటి విభాగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి, త్రిశక్తి శాస్త్రవేత్తల జీవిత చరిత్రలపై 40 ప్రశ్నల పరీక్ష 30 నిమిషాలు ఉంటుంది. రెండో విభాగంలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, రీజనింగ్‌ అంశాలపై 60 ప్రశ్నలతో 60 నిమిషాలు ఉంటుంది. ఇప్పటికే మొదటి విభాగానికి సంబంధించి సిద్ధమయ్యేందుకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ వీవీఎం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. లెవల్‌ – 1 తర్వాత రాష్ట్రస్థాయిలో లెవల్‌ – 2 పరీక్ష 45 నిమిషాల వ్యవధితో 50 మార్కులకు నిర్వహిస్తారు. ఆ తర్వాత జాతీయస్థాయి పరీక్ష ఉంటుంది.

ఆకర్షణీయమైన పురస్కారాలు

పాఠశాల, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు, నగదు బహుమతులు, మెమెంటోలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచేవారికి వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతి లభిస్తుంది. జాతీయస్థాయిలో మొదటి ముగ్గురికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల నగదు బహుమతే కాక సర్టిఫికెట్లు అందించనున్నారు.

విద్యార్థులు వీవీఎం పరీక్ష రాయడం భవిష్యత్‌కు ఉపయోగపడుతుంది. ఈ మేరకు సకాలంలో రిజిస్ట్రేషన్‌ చేసుకుని పరీక్షకు సిద్ధం కావాలి. స్కూల్‌, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిస్తే నగదు ప్రోత్సాహకాలతో పాటు మెరిట్‌ సర్టిఫికెట్లు అందుతాయి. జిల్లా విద్యార్థులు అరుదైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

–ఎనుముల వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్‌ అధికారి, ఖమ్మం

విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

చివరి తేదీ: సెప్టెంబర్‌ 30

పరీక్ష ఫీజు: రూ.200

పరీక్ష తేదీలు: 6, 7వ తరగతులు: నవంబర్‌ 16 లేదా 19

8, 9వ తరగతులు: నవంబర్‌ 17 లేదా 20

10, 11వ తరగతులు: నవంబర్‌ 20 లేదా 21

పరీక్ష సమయం: 90 నిమిషాల పరీక్షను ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యార్థులకు అనుకూలమైన సమయాన రాయొచ్చు.

రాష్ట్రస్థాయి పరీక్ష: 2027 జనవరి 3,10, 17

జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు DRDO, CSIR, ISRO, IICT, IISER, IIT, NIN, NGRI, BARC తదితర ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌నకు అవకాశం దక్కుతుంది. ఇది సంస్థల ఆధారంగా ఒకటి నుంచి మూడు వారాల పాటు ఉంటుంది. అంతేకాక జాతీయస్థాయి విజేతలకు ‘భాస్కర స్కాలర్‌షిప్‌’ పథకం ద్వారా ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement