మణుగూరుటౌన్: మండలంలోని రాజుపేట మీదుగా రాకపోకలు సాగించే ఇసుక లారీలు, బొగ్గు టిప్పర్లను డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్నారు. గురువారం అలాగే నిలిపివేయడంతో కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. లారీ కాంటా నుంచి రాజుపేట వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మిగతా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పాఠశాలలకు వెళ్లాల్సిన బస్సులు సైతం అరగంటకు పైగా నిలిచిపోయాయి. ఇసుక రీచ్‌ల నిర్వాహకులు ఇష్టానుసారంగా లారీలకు అనుమతిస్తుండడంతో తరచూ ఈ పరిస్థితి ఎదురవుతున్నందున పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.


