కరకగూడెం: ఒక పెద్ద తోటలో ‘చిట్టి’అనే చీమ ఉండేది. అది రోజంతా కష్టపడి గింజలు, ఇతర ఆహారం సేకరించి గూటిలో దాచుకునేది. అదే తోటలో ఓ తుమ్మెద కూడా ఉంటోంది. అది రోజంతా పూలపై వాలుతూ పాటలు పాడుతూ తిరిగేది. ఓ రోజు తుమ్మెద చీమను చూసి నవ్వి.. ‘ఏంటీ చీమా, రోజంతా పని చేస్తూనే ఉంటావు. జీవితాన్ని ఆనందంగా గడపడం తెలియదా?’ అని వెక్కిరించింది. చీమ మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ ‘ఇప్పుడు ఎండాకాలం.. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు ఆహారం దొరకదు. అందుకే ముందుగానే సిద్ధమవుతున్నాను’అంది. తుమ్మెద మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. ‘రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు ఆనందాన్ని ఎందుకు వదులుకోవాలి’అంటూ ఎగిరిపోయింది. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు మొదలయ్యాయి. గాలి బలంగా వీచింది. పూలన్నీ నేలకూలిపోయాయి. తుమ్మెదకు ఆహారం దొరకలేదు. చలి, ఆకలితో వణికిపోయింది. అప్పుడు దానికి చీమ గుర్తొచ్చింది. చీమ గూటి దగ్గరకు వెళ్లి ‘చీమా.. నాకు చాలా ఆకలిగా ఉంది. సాయం చేస్తావా’అని వేడుకోగా తన గూటిలోకి తీసుకెళ్లి ఆహారం పెట్టింది. దీంతో ఆశ్చర్యపోయిన తుమ్మెద.. ‘నేను నిన్ను ఎప్పుడూ ఎగతాళి చేశాను. అయినా నువ్వు నాకు సాయం చేస్తున్నావా..?’అని అడిగింది. ఇందుకు చీమ బదులిస్తూ ‘కష్టపడడం మనల్ని కాపాడుతుంది. మంచితనం మనల్ని గొప్పవాళ్లను చేస్తుంది’అని చెప్పగానే తుమ్మెద తన తప్పు తెలుసుకుని అది కూడా సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి పనిచేయడాన్ని అలవాటుగా మార్చుకుంది.
నీతి: ముందుచూపుతో కష్టపడే వారు ఆపద
ఎదురైనా సులభంగా అధిగమించగలరు.


