నిధులు కుదింపు | - | Sakshi
Sakshi News home page

నిధులు కుదింపు

May 24 2026 12:33 AM | Updated on May 24 2026 12:33 AM

● సుదర్శన చక్ర స్నాన తీర్థ ప్రాజెక్ట్‌ పూర్తిగా తొలగింపు ● ప్రజాప్రతినిధుల సూచనలతో రూ.75 కోట్ల నుంచి రూ.46 కోట్లకు తగ్గింపు ● గోదావరి ఒడ్డున సౌకర్యాలకు మళ్లీ ప్రతిపాదనలు

‘గోదారి గట్టు’
● సుదర్శన చక్ర స్నాన తీర్థ ప్రాజెక్ట్‌ పూర్తిగా తొలగింపు ● ప్రజాప్రతినిధుల సూచనలతో రూ.75 కోట్ల నుంచి రూ.46 కోట్లకు తగ్గింపు ● గోదావరి ఒడ్డున సౌకర్యాలకు మళ్లీ ప్రతిపాదనలు

భద్రాచలం: భద్రాచలంలో గోదావరి ఒడ్డున భక్తులకు సౌకర్యాల కల్పన, విస్తరణకు ప్రభుత్వం రూ.46.65 కోట్లను వెచ్చించనుంది. తొలుత రూ. 75 కోట్లను ప్రకటించగా, ఇటీవల రూ.46 కోట్లకు కుదించింది. ఈ మేరకు ఇరిగేషన్‌ శాఖ అధికారులు ప్రతిపాదనలను రూపొందించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు.

ప్రతిపాదనలు ఇలా..

ప్రస్తుతం ఉన్న హనుమాన్‌ టెంపుల్‌, ప్లాట్‌ఫారం, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌, గుడి వైపు మెట్లు, కరకట్ట వైపు మెట్లు కూల్చివేత, శిథిలాలు తొలగించి, స్థలం శుభ్రం చేయటానికి రూ.44.50 లక్షలు ప్రతిపాదించారు. స్నానఘాట్ల అభివృద్ధి, గణేష్‌ నిమజ్జనం ఘాట్‌ నిర్మాణానికి సుమారు రూ.22 కోట్లను వెచ్చించనున్నారు. కరకట్ట పటిష్టత, మెట్ల నిర్మాణానికి రూ. 3.14 కోట్లు, మల్టీపర్పస్‌ మండపం నిర్మాణానికి రూ.42 లక్షలు ప్రతిపాదించారు. పడమర వైపు నదీ హారతి సమర్పించేందుకు 7 ప్లాట్‌ఫారంల నిర్మాణానికి రూ.46 లక్షలు, తొలగించిన సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణానికి రూ.38 లక్షలు, ఘాట్‌ మెట్ల మరమ్మతులకు రూ.1.66 కోట్లు వెచ్చించనున్నారు. రూ. 4.60 కోట్లతో కరకట్ట పైభాగం విస్తరణ, 1.60 కోట్లతో ఎలక్ట్రికల్‌ పనులు, రూ. 61 లక్షలతో షవర్ల నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించారు. వీటన్నింటికి మొత్తం చార్జీలతో కలిపి రూ.46.65 కోట్లుగా అధికారులు నిర్ణయించారు.

సుదర్శన చక్ర స్నాన తీర్థ ప్రాజెక్ట్‌ తొలగింపు

ప్రభుత్వం ఆలయ విస్తరణకు కేటాయించిన రూ.180 కోట్ల బడ్జెట్‌ రూ.200 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో గోదావరి ఘాట్ల వద్ద కేటాయించే నిధులను తగ్గించింది. తొలుత రూ.75 కోట్లు ప్రకటించగా, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అందులో రూ.29 కోట్లు తగ్గించి, రూ.46 కోట్లకు కుదించారు. గతంలో టాయిలెట్‌ బ్లాక్‌కు రూ.74 లక్షలు, కల్యాణ కట్ట నిర్మాణానికి రూ.38 లక్షలు, పిండ ప్రధాన మండపానికి రూ.38 లక్షలు ప్రతిపాదించారు. రూ. 9 కోట్లతో సుదర్శన చక్ర స్నాన తీర్థ ప్రాజెక్ట్‌ నిర్మాణం తలపెట్టారు. ప్రస్తుతం వీటన్నింటినీ పూర్తిగా రద్దు చేశారు. ఎలక్ట్రికల్‌, ఇతర పనుల్లో కూడా బడ్జెట్‌ తగ్గించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించగానే టెండర్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు ఇరిగేషన్‌ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మాడవీధుల విస్తరణ బిల్లులు ఇంకా రాలే

గతంలో ఆలయ అభివృద్ధిలో చేపట్టిన భూ సేకరణ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నర గడుస్తున్నా బిల్లులకు అందకపోవడంతో ఇతర పనులు నిలిచిపోయాయి. మాడ వీధుల విస్తరణలో కూల్చివేత, శిథిలాల సేకరణ బిల్లులు రూ. 78 లక్షలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ స్థలంలో చేపట్టాల్సిన పనులకు రూ.2.98 కోట్లు అందాల్సి ఉంది. ఈ క్రమంలో పనులు పూర్తి కాలేదు. నిర్వాసితులకు స్థలం సైతం అందటం లేదు. ఉన్నతాధికారులు చొరవ చూపి బిల్లులను విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement