‘ఉపాధి’ కూలీలకు సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

May 22 2026 12:24 AM | Updated on May 22 2026 12:24 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న పనులను కలెక్టర్‌ అంకిత్‌ గురువారం పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వేతనాల గురించి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున పనిస్థలాల్లో కార్మికులకు తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స పెట్టెలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. డీఆర్డీఓ విద్యాచందన, తహసీల్దార్‌ శిరీష, సర్పంచ్‌ అంజలి పాల్గొన్నారు.

పర్యాటక సమాచారం చేరవేయాలి

జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, విశిష్టతలను ప్రజలకు చేరవేయాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్‌లో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, పర్యాటక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కిన్నెరసాని, భద్రాచలం దేవస్థానం, తుమ్మలచెరువు, బెండాలపాడు, పర్ణశాల తదితర ప్రాంతాల వివరాలను సోషల్‌ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు చేరవేయాలన్నారు. అనంతరం టూరిజం శాఖ అధికారి పరంధామరెడ్డితో కలిసి పర్యాటక వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు.

వ్యవసాయ మార్కెట్‌లో తనిఖీ

లక్ష్మీదేవిపల్లి మండలంలోని కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్‌ను కలెక్టర్‌ అంకిత్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొక్కజొన్న కొనుగోలు, నిల్వలు, లోడింగ్‌ ప్రక్రియలను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కజొన్న బస్తాల తూకం, నిల్వ, రవాణా ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. మార్కెట్‌ యార్డులో రైతులకు తాగునీరు, నీడ సదుపాయాలు కల్పించాలన్నారు.

కలెక్టరేట్‌లోని వివిధ కార్యాలయాల్లో తనిఖీ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కలెక్టర్‌ అంకిత్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆలస్యంగా వస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, గురువారం రోజు వేతనంలో కోత విధించాలని అధికారులను ఆదేశించారు. ఏఓ అనంత రామకృష్ణ ఉన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి

జనగణన కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ (హెచ్‌ఎల్‌బీ) ప్రక్రియలో నమోదవుతున్న పొరపాట్లు, సవరణ విధానం, ఫీల్డ్‌ స్థాయిలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కలెక్టర్లు, చార్జ్‌ ఆఫీసర్లు, హెచ్‌ఎల్‌బీ సిబ్బందితో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ భారతి హోలీకేరీ మాట్లాడుతూ జనగణన హౌస్‌ లిస్టింగ్‌లో కచ్చితత్వానికి ప్రాధాన్య ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్‌ నుంచి సీపీఓ సంజీవరావు, కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సుజాత, సంబంధిత శాఖల చార్జ్‌ ఆఫీసర్లతో కలెక్టర్‌ అంకిత్‌ హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement