పుష్కలంగా కిన్నెరసాని జలాలు | - | Sakshi
Sakshi News home page

పుష్కలంగా కిన్నెరసాని జలాలు

May 22 2026 12:24 AM | Updated on May 22 2026 12:24 AM

397.4 అడుగుల వద్ద నీటిమట్టం

పాల్వంచరూరల్‌: వేసవి ఎండల తీవ్రత ఉన్నా ఈసారి కిన్నెరసానిలో నీటిమట్టం తగ్గలేదు. వానాకాలంలో జలాశయంలో గరిష్టస్థాయి నీటిమట్టం 406 అడుగుల వరకు నిల్వచేయడంతోపాటు నీటి వినియోగం కూడా గతం కంటే తగ్గిందని సంబంధిత డ్యామ్‌ ఇంజనీరు తెలిపారు. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని జలాశయంలో వేసవి కాలం పూర్తి కావొస్తున్న సమయంలో కూడా గురువారం నాటికి 397.4 అడుగుల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజున 396 అడుగుల ఉన్నట్లు డ్యామ్‌ పర్యవేక్షణ ఇంజనీరు తెలిపారు. జలాశయం నుంచి కేటీపీఎస్‌, నవభారత్‌, కర్మాగారాలతోపాటు కొత్తగూడెం కార్పొరేషన్‌కు తాగునీటి అవసరాల కోసం రోజూ 90 క్యూసెక్కుల నీరు సరఫరా సరఫరా చేస్తున్నారు. గతంలో కేటీపీఎస్‌ పాతప్లాంట్‌ ఉండటంతో రోజూ 120 క్యూసెక్కుల నీరు బయటకు తరలించేవారు. పాతప్లాంట్‌ తొలగించడంతో నీటి వినియోగం తగ్గింది. దీంతో జలాశయంలో నీరు పుష్కలంగా ఉంది.

శాంతిభద్రతలను పరిరక్షించాలి

ఎస్పీ రోహిత్‌ రాజు

మణుగూరు రూరల్‌: బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజు పోలీస్‌ అధికారులకు సూచించారు. గురువారం మండలంలోని సిటైప్‌ క్లబ్‌లో మణుగూరు సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న బక్రీద్‌ పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. తొలుత ఎస్పీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐలు పి.నాగబాబు, అశోక్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, ఎస్సైలు నగేష్‌, సురేష్‌, పీవీఎన్‌ రావు, రాజేష్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఠాణా నిర్మాణం త్వరితగతిన

పూర్తి చేయాలి

అంబేద్కర్‌ సెంటర్‌లో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్‌స్టేషన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు పోలీస్‌ అధికారులకు సూచించారు. నిర్మాణ దశలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.

బీఆర్‌ఎస్‌ సభ్యత్వ

నమోదుకు ఇన్‌చార్జ్‌లు

పది నియోజకవర్గాలకు నియామకం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తోంది. సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఆధ్వర్యాన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు కూడా ఇన్‌చార్జ్‌లను నియమించగా, పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని కేసీఆర్‌ సూచించారు.

ఇన్‌చార్జిలు వీరే..

ఖమ్మం నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌గా ఏనుగుల రాకేష్‌రెడ్డిని నియమించారు. అలాగే, సత్తుపల్లికి కూరాకుల నాగభూషణం, వైరాకు గుండాల కృష్ణ, మధిరకు నామా నాగేశ్వరరావు, పాలేరుకు తాతా మధుసూదన్‌ నియమితులయ్యారు. అంతేకాక కొత్తగూడెంకు వద్దిరాజు రవిచంద్ర, భద్రాచలానికి రావులపల్లి రాంప్రసాద్‌, పినపాకకు దిండిగల రాజేందర్‌, ఇల్లెందుకు చాడా కిషన్‌రెడ్డితో పాటు అశ్వారావుపేట నియోజకవర్గానికి ఉప్పల వెంకటరమణను నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement