అల్పాహారం ఇలా..
త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో
పిల్లలకు అల్పాహారం
మధ్యాహ్నం భోజనం కూడా
ఉండటంతో పౌష్టికాహార లోపానికి చెక్
ఏజెన్సీ ప్రాంత చిన్నారులకు ఎంతో
ఉపయోగం
మార్గదర్శకాలు రాగానే అమలు
భద్రాచలంఅర్బన్: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ‘తొలిముద్ద’పేరుతో అల్పాహారం అందించనున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆచరణలోకి తేవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతం అయిన భద్రాచలం పరిసర ప్రాంతంలో చిన్నారులు పోషకాహార లోపంతో ఉండటం, ఎత్తుకి తగ్గ బరువు లేక ఏరియా ఆస్పత్రిలోని ఎన్‌ఆర్సీ సెంటర్‌లో చికిత్స పొందుతున్న విషయాలు విదితమే. ఇలాంటి లోపాలను అధిగమించేందుకు ఈ పథకం ఉపయోగపడనుందని పలువురు చెబుతున్నారు.
పిల్లల ఎదుగుదలకు..
పిల్లలకు పోషకాహారం అందితేనే వారి శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. సమతుల పోష కాహారం అందకపోవడంతో పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చాలా మంది చిన్నారుల తల్లిదండ్రు లు కూలీ, వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఉద యం పూట చిన్నారులు ఇంట్లో తినీతినకుండానే కేంద్రాలకు వెళ్లడంతో అక్కడ నీరసించిపోతున్నా రు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరికి భోజనం పెడతారు. అప్పటివరకు నిరీక్షించాల్సిందే. ఈ క్రమంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బక్కచిక్కిపోవడంతో పాటు వివిధ రుగ్మతలు వెంటాడుతున్నాయి. పౌష్టికాహా రం అందించడంతో వారిలో ఎదుగుదలతో పాటు కేంద్రానికి వచ్చే చిన్నారుల సంఖ్య సైతం పెరగనుంది. చాలా మంది చిన్నారులు 10 గంటలు దాటితే కానీ కేంద్రాలకు రావడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు నడుస్తుండగా. చాలా కేంద్రాల్లో చిన్నారుల గైర్హాజరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఆరేళ్ల లోపు చిన్నారులకు ఉదయం పూట అల్పాహారం అందించనున్నారు. ఈ మేరకు రెడీ టూ కుక్ ఉప్మా, కిచిడీ సరఫరా బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్‌కు అప్పగించారు. కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు పిల్లలకు ఏకరూప దుస్తులు అందిస్తుండగా, కొత్తగా అల్పాహారం పథకం అమలుతో కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2061 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో మూడేళ్లు పైబడి 31,711 మంది చిన్నారులు ఉన్నారు.
ప్రస్తుతం ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు చిన్నారులకు బాలామృతం, నెలకు 16 కోడిగుడ్లు ఇస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతిరోజూ ఉడికించిన గుడ్డు, ఒక పూట భోజనం పెడుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, సాంబార్‌తో వడ్డిస్తున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలకు ఈ కార్యక్రమం అమలవుతోంది. అయితే, మధ్యాహ్నం తర్వాత చిన్నారులకు భోజనంతో పెడుతుండటంతో వారు నీరసించిపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చిన్నారులకు కిచిడీ, ఉప్మా తదితర అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తోంది.
పథకం అమలుకు మార్గదర్శకాలు రాగానే అన్ని కేంద్రాల్లో అమలయ్యేలా చర్యలు చేపడతాం. పథకం అమలుతో పోషకాహార లోపం ఉన్న పిల్లల సంఖ్యను మరింత తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకా రెడీ టూ కుక్ అల్పాహారం ప్యాకెట్లు కేంద్రాలకు సరఫరా కావాల్సి ఉంది.
–జ్యోతి, దుమ్ముగూడెం సీడీపీఓ


