ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసే వరకు పోరాడుతామని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భూదాన్ భూముల నుంచి పేదలను తొలగించిన ప్రభుత్వం, ఇప్పటికీ పునరావాసం కల్పించకపోవడం గర్హనీయమన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం ధర్నాచౌక్ నుంచి కలెక్టరేట్ ప్రధాన గేటు వరకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత నాయకులతో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. మొత్తం 729 కుటుంబాలు ఇళ్లు కోల్పోగా పలువురికి వెలుగుమట్లలో, ఇంకొందరికి స్వగ్రామాల్లో ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. కాగా, కేటాయింపుల్లో లోపాలు ఉన్నట్లు తేలడంతో పునఃపరిశీలన చేస్తున్నామని, జాబితాలో అర్హులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, నాయకులు బండారు రమేశ్, షేక్ మీరాసాహెబ్, ఎస్.నవీన్‌రెడ్డి, షేక్ నాగుల్‌మీరా, బోడపట్ల సుదర్శన్, బేగం, బాగం అజిత, ఏవీ రెడ్డి, కూచిపూడి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి
నున్నా నాగేశ్వరరావు


