ప్రస్తుతం 1.20లక్షల ఎకరాల్లో సాగు
ఎకరానికి రూ.లక్ష నికర ఆదాయం
సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
పెరుగుతున్న విస్తీర్ణం..
ఏన్కూరు: సంప్రదాయ పంటలు సాగు చేసి వాటికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులు ఉద్యానవన పంట సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో ఆయిల్‌పామ్ సాగు ఒకసారి సాగు చేస్తే 30 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి కబరుస్తున్నారు. ఫలితంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చే ఆయిల్‌పామ్ సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటేటా పెరుగుతోంది.
అత్యధికంగా ఇక్కడే...
రాష్ట్రంలో ప్రస్తుతం 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా 1.20 ఎకరాలతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలి చింది. ఖమ్మం జిల్లాలో 40వేల ఎకరాలు, భధ్రాద్రి – కొత్తగూడెం జిల్లాలో 80వేల ఎకరాల్లో పంట సాగవుతోంది. ఈ సాగువలన కోతుల బెడద కూడా లేకపోవడంతో సాగుపై ఆదరణ పెరుగుతోంది. సంప్రదాయ పంటలను మార్కెట్‌లో విక్రయించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుండగా.. అయిల్‌పామ్ సాగు చేసిన రైతులకు దళారీలు లేకుండా నేరుగా కంపెనీ వారే కొనుగోలు చేయడంతో గిట్టుబాటు ధర పొందుతున్నారు. ఆయిల్ ప్రతి ఇంట్లో నిత్యావరస వస్తువు కాగా ప్రతీ మనిషి ఏడాదికి 19.5 కేజీలు వాడుతున్నారు. దీంతో ఆయిల్‌పామ్ సాగు చేసినప్పటికీ అది సరిపోకపోవడంతో మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి 71 లక్ష మెట్రిక్ టన్నుల ఆయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వం ఆయిల్‌పామ్ రైతులను ప్రోత్సహిస్తుండగా.. ఆ సాగు కష్టాలు తీర్చే కల్పతరువు అయింది. ఆయిల్‌పామ్ సాగు 2022 లో ఉమ్మడి జిల్లాలో 50వేల ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
పెట్టుబడులు ఇలా
ఆయిల్‌పామ్ సాగు ఎకరానికి మొక్కలు, ఎరువులు కలిపి రూ,25వేల వరకు పెట్టుబడులు అవుతాయి. సాగు చేసినప్పటి నుంచి 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు దిగుబడి వస్తూ ఏటేటా పెరుగుతూ ఉంటుంది. 8వ సంవత్సరం నుంచి ఎకరానికి 12 టన్నుల వరకు దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఆయిల్‌పామ్ టన్ను రూ. 21,450 పలుకుతుంది. దీంతో ఆయిల్‌పామ్ సాగు కు డిమాండ్ పెరగడంతో కౌలు ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఇస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతో..
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కింద సుమారు ఎకరానికి రూ.51వేల వర కు ఇస్తుంది. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్, పంట చేతి కోచ్చే వరకూ నాలుగేళ్ల వరకు రైతుకు అండగా ఉంటుంది. రైతులకు ఆయిల్‌పామ్ మొక్క ఒకటి రూ. 193 ఉంటుంది, రైతు మాత్రం మొక్కకు రూ.20 చొప్పున చెల్లిస్తే ఎకరానికి 57 మొక్కలు అందిస్తారు. తద్వారా రైతుకు రూ.11వేల వరకు ఆదా అవుతుంది. ఇక డ్రిప్ ఇరిగేషన్‌కు రూ.23,200 ఇస్తుంది. రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసిన నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ 4,200 చొప్పున అకౌంట్‌లో పడుతుంది. దీంతో రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి వారిని ప్రొత్సహిస్తుంది.
ఆయిల్‌పామ్ సాగులో ఉమ్మడి జిల్లా ప్రథమం
ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు నానాటికి పెరుగుతోంది. 2022లో ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్‌పామ్ సాగు చేయగా 2026 నాటికి 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతులకు సబ్సిడీ ఇచ్చి గిట్టుబాటు ధర రావడంతో పాటు కోతుల బెడద కూడా లేకపోవడంతో చాలామంది రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. – ఎం.వి మధుసూదన్,
ఉద్యానవన శాఖాధికారి, ఖమ్మం


