జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు లోక్‌అదా లత్ అద్భుతమైన వేదికని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శని వారం జాతీయ లోక్ అదా లత్ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇరుపక్షాలు రాజీ మార్గంలో, స్నేహపూర్వక వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైతే కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తారని, దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని వివరించారు. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు డిక్రీతో సమానమని, దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎస్‌బీఐసౌజన్యంతో కక్షిదారులకు పులిహోర, తాగు నీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.సరిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్, జడ్జిలు కిరణ్‌కుమార్, సుచరిత, బత్తుల రవికుమార్, వినయ్‌కుమార్, సాయిశ్రీ, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
7,866 కేసుల పరిష్కారం
జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 7,866 కేసులు పరిష్కారమయ్యాయి. కొత్తగూడెం కోర్టులో 5,054, ఇల్లెందులో 797, భద్రాచలంలో 1,729, మణుగూరులో 286 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు.
31న క్రీడా పాఠశాలలకు ఎంపికలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 31న జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి ఎం పరంధామరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు మండలస్థాయి ఎంపికలు ఆయా మండలాల ఎంఈఓల సమక్షంలో జరిగాయని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో 10 మంది బాలురు, 10 మంది బాలికలు.. మొత్తం 20 మందిని ఎంపిక చేసి ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తామని వివరించారు. వివరాలకు 95054 23226 నంబరులో సంప్రదించాలని సూచించారు.
సస్పెండ్ చేస్తావా.. కోర్టుకు వెళ్తా !
నేలకొండపల్లి: బాధ్యత కలిగి న ఉద్యోగి మద్యం మత్తులో విధులకు హాజరు కావడమే కాక జిల్లా అధికారితో వాగ్వాదానికి దిగిన ఘటన ఇది. నేలకొండపల్లి వ్యవసాయ మార్కె ట్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న పంతులు శనివారం మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఏం.ఏ.అలీం సాధారణ తనిఖీల్లో భాగంగా కార్యాలయానికి వెళ్లగా ఈ విషయాన్ని గుర్తించారు. మద్యం తాగి రావడం ఏమిటని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ వాగ్వాదానికి దిగాడు. అంతేకాక ‘ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారా, చేసుకోండి... కోర్టుకు వెళ్తా’ అంటూ గొడవ పడ్డాడు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు మార్కెట్ చైర్మన్‌కు ఫోన్‌లో వివరించిన డీఎంఓ.. 108 వాహనం పిలిపించి వైద్యపరీక్షల కోసం ఆయనను ఖమ్మం ఆస్పత్రికి పంపించారు. ఇటీవల పంతులు కార్యాలయ సిబ్బందిని కూడా దూషించినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఈ విషయమై డీఎంఓ అలీంను వివరణ కోరగా.... మద్యం మత్తులో విధులకు హాజరైన కార్యదర్శిపై వైద్యుల నుంచి నివేదిక వచ్చాక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.


