భద్రాచలంటౌన్: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహచ్‌ఓ తుకారాంరాథోడ్ పేర్కొన్నారు. పట్టణంలోని జాబిల్లి, రాధ ఆస్పత్రులను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నా రు. ఆస్పత్రి రిసెప్షన్ వద్ద సేవల చార్జీలు, అందుబాటులో ఉన్న చికిత్స, వైద్యుల పేర్లు, అర్హతలు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఆయన వెంట ఇమ్యునైజేషన్ అధికారి ప్రతాప్, మలేరియా నిర్మూలన అధికారి రాందాస్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
తేనెటీగల పెంపకంతో ఉపాధి
భద్రాచలంటౌన్: తేనెటీగల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుని గిరిజన యువత ఆర్థికంగా బలపడాలని ఐటీడీ ఏ పీఓ బి.రాహుల్ సూ చించారు. శనివారం స్థానిక వైటీసీలో ఐదు రోజులపాటు నిర్వహించిన హనీబీ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో లభించే తేనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలతో తేనె ఉత్పత్తి, మార్కెటింగ్‌లో రాణించాలని కోరారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు, హనీబీ బాక్సులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరా
విద్యుత్ ఎస్‌ఈ మహేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): వేసవి కాలంలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించడంపై దృష్టి సారించామని విద్యుత్ ఎస్‌ఈ గొట్టిముక్కల మహేందర్ శనివారం తెలిపారు. గతేడాది నుంచే వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని, ఎలాంటి అవాంతరం ఎదురైనా అధిగమిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లోడ్ పెరిగే 225 ప్రాంతాల్లో నూతన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఉపకేంద్రాల సామర్థ్యం పెంచేలా రెండు సబ్‌స్టేషన్లు, 32 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఇంటర్ లింకింగ్ వ్యవస్థను తీసుకొచ్చామని, అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ఏదైనా ఉపకేంద్రంలో సమస్య తలెత్తినా పరిష్కరించేవరకు మరో కేంద్రం నుంచి సరఫరాను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ ప్రస్తుతం 13 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తి చేశామని వివరించారు. వినియోగదారుల సేవలకు ఆధునిక సాంకేతికతను జోడించామని, కార్యాలయాలకు రాకుండా ‘వాట్సప్, చాట్–బాట్, విద్యుత్ ప్రజావాణి, 1912 టోల్‌ఫ్రీ నంబర్లను ఫోన్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు.


