● ప్రముఖులకు తప్పని అడ్డంకులు ● ఖమ్మం జడ్జి, రామదాసు వారసుడికి సైతం అనుమతి నిరాకరణ
భద్రాచలం/భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో శుక్రవారం జరిగిన శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. పలువురు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఎస్పీ రోహిత్‌రాజు 2000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 36 గంటల ముందు నుంచే భద్రాచలంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రామాలయానికి వెళ్లే దారిలో ముఖద్వారం వద్ద పోలీసులు సీఎం కాన్వాయిలో వచ్చే వాహనాలను మాత్రమే అనుమతించడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డి కల్యాణంలో పాల్గొనడానికి సారపాక నుంచి భద్రాచలం వస్తున్నారని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్‌ను 30 నిమిషాల పాటు నిలిపివేశారు. కల్యాణం ముగిశాక సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భద్రాచలం నుంచి సారపాకకు వెళ్తున్న క్రమంలో మళ్లీ ట్రాఫిక్‌ను 15 నిమిషాల పాటు నిలిపివేశారు. తర్వాత కరకట్ట వైపుగా బ్రిడ్జి సెంటర్ నుంచి సారపాక వెళ్తన్న వాహనాలను మళ్లించే క్రమంలో ప్రతి 15 నిమిషాలకు వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
ప్రముఖులకూ తప్పలేదు..
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యాన పోలీసుల పటిష్ట బందోబస్తు ఉన్నప్పటికీ.. పలు చోట్ల శ్రుతిమించడంతో అందరూ అసహనం వ్యక్తం చేశారు. వీఐపీలు, వీవీఐపీలకు సైతం ఈ బెడద తప్పకపోవడం గమనార్హం. స్వయాన భద్రాచలం ఆలయ ఈఓ దామోదర్‌రావుకే ఈ అనుభవం ఎదురైంది. ఈఓ ఆలయానికి వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారి అడ్డుకోగా.. ఆలయ సిబ్బంది సర్దిచెప్పినప్పటికీ దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. మిథిలా స్టేడియంలో కల్యాణానికి వస్తున్న ఖమ్మం ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చనాకుమారిని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ అడ్డుకున్నారు. పాస్ చూపించినా వినిపించుకోకపోవడంతో ఆమె భద్రాచలం జడ్జిని కలిసి.. ఆ తర్వాత సెక్టార్‌లోకి వెళ్లారు. ఇక భక్త రామదాసు వారసుడిగా దేవస్థానంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే కంచర్ల శ్రీనివాసరావు దంపతులను సైతం అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. పాస్, అనుమతి పత్రాలను చూపించినా అధికారులు ససేమిరా అన్నారు. గంట అనంతరం పలువురు వచ్చి చెప్పడంతో ఆయనను అనుమతించారు. పోలీసు సిబ్బంది, చోటామోటా రాజకీయ నాయకులను మాత్రం అడ్డగోలుగా సెక్టార్లలోకి అనుమతించటం విశేషం.
అడ్డదిడ్డంగా బారికేడ్లు
ఈ ఏడాది భద్రాచలంలోని పలు వీధుల్లో పోలీసులు అడ్డదిడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయటం విమర్శలకు దారితీసింది. స్థానికులు, ఇతరులు తమ ద్విచక్ర వాహనాలను సుదూరంగా ఉంచి కాలినడకన చేరాల్సి వచ్చింది. ఇక రామాలయ పరిసర ప్రాంతాల కాలనీలకు చెందిన ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రెండు రోజుల నుంచి వారి వాహనాలను అడ్డుకుంటుండడంతో బారికేడ్లను దాటుకొని రావడం ప్రహసనంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.


