ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యాగశాలలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ ఆధ్వర్యాన మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉత్సవాల ముగింపు సూచికగా ధ్వజ పతాకాన్ని అవనతం చేశారు. అలాగే, ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో చక్రస్నానం ఆచరించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, శ్రీరామచంద్రమూర్తి, పుష్కరిణి నిర్మాణ దాత గుదే వెంకటేశ్వరరావు దంపతులు, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ పాల్గొన్నారు.


