మూడేళ్లుగా విజయ బ్రాండ్ నూనెల అమ్మకాలు సుమారుగా..
● ఆయిల్‌ఫెడ్‌లో సిండికేట్‌ల దందా..? ● ఓ రిటైర్డ్ ఉద్యోగి సంస్థ కోసం విజయ బ్రాండ్‌కు వెన్నుపోటు..? ● మార్కెటింగ్‌లోకి మరో అవినీతి అధికారి? ● అంతా ఆ రైతు నాయకుడి చొరవేనని ప్రచారం..
అశ్వారావుపేట: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో తెరవెనుక ఒప్పందాలు కొనసాగుతూనే ఉన్నాయి. జీఎం సుధాకర్‌రెడ్డి ఉద్యోగం కొనసాగింపు వివాదంతో మొదలైన తంతు మార్కెటింగ్ భవితవ్యం వరకు వెళ్లింది. ఆయిల్‌ఫెడ్ అంటే రైతులకు నాణ్యమైన ఆయిల్‌పాం మొక్కలు, ఎరువులు సరఫరా చేసి ఉత్పత్తయిన గెలలను కొనుగోలు చేసి గానుగాడి ముడిచమురు, గింజలు, పీచు, తదతర వ్యర్థాలపై రైతులకు 75 శాతం వాటా చెల్లించే ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో మిగిలిన 25 శాతం ఉద్యోగుల వాటాకు కేటాయించారు. అయితే ఫ్యాక్టరీల్లో గానుగాడిన ముడిచమురును ఎప్పటికప్పుడు అమ్మేసుకుంటారు. విజయ బ్రాండ్ వారు ఆయిల్‌ఫెడ్ అమ్మే పామాయిల్ ప్యాకెట్లకు కావాల్సిన ముడిచమురును మళ్లీ అంతర్జాతీయ మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఇక మార్కెటింగ్ శాఖలో వేళ్లూనుకుపోయిన ఓ అధికారి విరమణ పొందాడు. కానీ, తనకు నాలుగు దశాబ్దాలు జీతభత్యాలిచ్చిన సంస్థకే శఠగోపం పెట్టాలని చూశాడు?. ఇందుకు ఇంకా కొలువులో ఉన్న గత సహచరుడు.. రాజకీయ పలుకుబడి ఉన్న ఓ రైతు సంఘం నాయకుడు కొమ్ము కాస్తున్నారు.
విజయ బ్రాండ్ మార్కెట్‌కు కింగ్..
తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ద్వారా మార్కెట్ చేస్తున్న విజయ బ్రాండ్ వంట నూనెలకు మార్కెట్‌లో భారీ క్రేజ్ ఉంటుంది. వందలాది బ్రాండ్‌లతో ప్రైవేట్ కంపెనీలు అమ్ముకునే నూనెల కంటే మార్కెట్ ధర సరాసరి రూ.5 ఎక్కువైనా.. వినియోగదారుల నుంచి డిస్టిబ్యూటర్ల వరకు విజయ బ్రాండ్ నూనెకే ప్రాధాన్యమిస్తారు. ఇందులో ఉద్యోగుల గొప్పతనమేమీ లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్తీ లేని స్వచ్ఛమైన నూనెనే తయారు చేయడం ద్వారా విజయ బ్రాండ్‌కు దశాబ్దాల నుంచి మంచి పేరు వచ్చింది.
మరి మార్కెటింగ్ ఎలా..?
కొత్తగా ఏర్పాటైన కంపెనీ చమురును పోటీ మార్కెట్‌లో అమ్మాలంటే బోలెడంత పబ్లిసిటీ అవసరం. ఆఫర్లు ఇవ్వాలి. ఇవన్నీ లేకుండా తనకున్న అపారమైన అనుభవంతో సహ ఉద్యోగి, వాటాదారులతో కలిసి విజయ బ్రాండ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుని.. విజయ బ్రాండ్‌కు కృత్రిమ కొరత సృష్టించే విధంగా పథకం పన్నినట్లు సమాచారం. అంతే కాకుండా విజయబ్రాండ్ నూనెలు కొరత వచ్చినపుడు తమ ‘అమోఘ’మైన నూనెలు కొనాలని ఇప్పటికే కొందరు డిస్ట్రిబ్యూటర్‌లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మార్కెట్ స్కీంలను కాస్త భారంగా చూపించి వారి సొంత బ్రాండ్‌ను అమ్మేసుకుందామని భారీ స్కెచ్‌వేసినట్లు తెలుస్తోంది. షేర్‌లింగంపల్లి ప్లాంట్‌లో ప్యాకింగ్‌ను పర్యవేక్షించే వారిని మేనేజ్ చేయడం ద్వారా మార్కెటింట్ శాఖను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాదుకు బదిలీ అయిన ఓ అధికారికి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో సదరు రిటైర్డ్ ఉద్యోగి, విరమణ పొందాల్సిన మరో ఉద్యోగి, ఓ రాజకీయ రైతు ప్రముఖులు కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం. అప్పారావుపేట ఫ్యాక్టరీలో రెండు ప్రమా దాల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారా..? గాయాల పాలయ్యారా అనే విషయం బయటకు రానీయకుండా తొక్కిపట్టిన ఘనత ఉండటంతోపాటు అవి నీతి సిండికేట్‌కు వినయంగా ఉన్నారనే నమ్మకంతో మార్కెటింగ్‌ను సదరు ఉద్యోగికి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలకులే దీనిపై దృష్టి సారించి ఆయిల్‌ఫెడ్ మాజీ ఉద్యోగులందరి పూర్వ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై విచారణ చేపట్టి.. తెలంగాణలో స్థాపిస్తున్న పామాయిల్ అనుబంధ కంపెనీలు, ఫ్యాక్టరీల్లో మాజీ ఉద్యోగుల పాత్ర, వాటాలను విచారించి ఆయిల్‌ఫెడ్‌ను,విజయ బ్రాండ్‌ను కాపాడాలని కోరుతున్నారు.
సంవత్సరం అమ్మకం విలువ
(మెట్రిక్ టన్నుల్లో) రూ.కోట్లలో
2022–23 27,328 రూ.418
2023–24 31,274 రూ.382
2024–25 30,211 రూ.415
ఇలా ఏటా పెరుగుతున్న సేల్స్ చూసి అప్పటి దాకా పర్యవేక్షించిన ఓ మాజీ అధికారికి అదే వ్యాపారం చేయాలనే ఆలోచన రావడం, ఆచరణలో పెట్టడం చకాచకా జరిగినట్లు సమాచారం.


