నేడు ఎదుర్కోలు ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు ఎదుర్కోలు ఉత్సవం

Mar 26 2026 7:42 AM | Updated on Mar 26 2026 7:42 AM

రేపు సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేకం అగ్నిప్రతిష్ఠాపన .. ధ్వజారోహణం ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష ముత్యాల కానుక భారీ బందోబస్తు

భద్రాచలం: శ్రీసీతారాముల కల్యాణ ఘడియలు సమీపించాయి. కల్యాణ మహోత్సవంలో కీలకమైన ఎదుర్కోలు ఉత్సవం గురువారం సాయంత్రం నిర్వహించనున్నారు. హిందూ ఆచారం ప్రకారం ప్రతి ఇంటా కల్యాణంలో ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు. ఆదర్శ జంటకు ప్రతీకలైన శ్రీ సీతారాముల పెళ్లి సందర్భంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. మిథిలా స్టేడియం సీతమ్మవారికి మిథిలా నగరం కాగా, మరో పక్కనున్న వైకుంఠ ద్వారం రామయ్యకు చెందిన అయోధ్యగా అభివర్ణిస్తారు. హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరును చల్లడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాచల దేవస్థానంలో ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరపటం విశేషం. కాగా శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణం, శనివారం పట్టాభిషేక మహోత్సవం జరపనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ మహా విష్ణువు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఉదయం యాగశాలలో తిరువారాధన సేవా కాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిపారు. అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన జరిపి, కర్మణ, పుణ్యావాచన, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన ద్వార తోరణ ఆరాధన జరిపి నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన జరిపారు.

యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలతో అర్చక పరిచారక వేద పండితులు తీసుకొని రాగా బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, గరుడ గద్యనం, గరుడ మంగళాష్టకములను తర్పానందంగా ప్రధానార్చకులు చదవగా గరుడ పటాన్ని మంగళ వాయిద్య ఘోష నడుమ ధ్వజారోహణం చేశారు. అనంతరం బలిహరణం జరిగింది. సంతానం లేని వారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు దంపతులు, ఏఈఓలు శ్రవణ్‌కుమార్‌, భవాని రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి పాల్గొన్నారు.

భద్రాచలంటౌన్‌ : శ్రీరామనవమి మహోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్‌ అంకిత్‌ బుధవారం సమీక్షించారు. మిథిలా స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీ లించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నిర్వహించనున్న భూమిపూజ, కల్యాణ వేడుకల ఏర్పాట్లపై ఆలయ ఈఓ దామోదరరావు, అర్చకులతో చర్చించారు. వీవీఐపీ సెక్టార్లలో బారికేడింగ్‌, భద్రత, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్‌ సౌరభ్‌ శర్మ పాల్గొన్నారు.

స్వామివారి కల్యాణ మహోత్సవానికి వరంగల్‌కు చెందిన భక్తులు బుధవారం ముత్యాలను విరాళంగా సమర్పించారు. వరంగల్‌కు చెందిన నలివెల శివయ్య, నలివెల కోటేశ్వరరావు, నలివెల ఆయిలయ్య, నలివెల రాజ్‌ కుమార్‌ బుధవారం దేవస్థానం ఈఓకు ముత్యాలను అందజేశారు. ఏటా ఆనవాయితీగా ముత్యాలను సమర్పిస్తున్నట్లు భక్తులు తెలిపారు.

శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల నేపథ్యంలో భద్రాచలంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ రోహిత్‌ రాజు తెలిపారు. పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఏఎస్పీ విక్రంత్‌ కుమార్‌సింగ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. సుమా రు 2 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇతర శాఖలతో సమన్వయం పాటించాలని సూచించారు. పార్కింగ్‌, లడ్డూ కౌంటర్లు, సెక్టార్ల వివరాల కోసం ప్రత్యేక క్యూ ఆర్‌ కోడ్‌, ఆన్‌లైన్‌లింక్‌ను అందుబాటులోకి తెచ్చి నట్లు వెల్లడించారు. సెక్టార్ల ఇన్‌చార్జ్‌ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement