కొత్తగా రెండు.. | - | Sakshi
Sakshi News home page

కొత్తగా రెండు..

Mar 26 2026 7:42 AM | Updated on Mar 26 2026 7:42 AM

● అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజనకు అడుగులు ● రెండు జిల్లాల్లో ఒక్కొక్కటి పెరిగే అవకాశం ● ఇదే సమయాన నియోజకవర్గమంతా ఒకే జిల్లాలోకి.. ● తద్వారా మారనున్న రాజకీయ ముఖచిత్రం ఇక్కడొకటి.. అక్కడొకటి

● అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజనకు అడుగులు ● రెండు జిల్లాల్లో ఒక్కొక్కటి పెరిగే అవకాశం ● ఇదే సమయాన నియోజకవర్గమంతా ఒకే జిల్లాలోకి.. ● తద్వారా మారనున్న రాజకీయ ముఖచిత్రం

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పది నియోజకవర్గాలు ఉండగా, పునర్విభజనతో మరో రెండు ఏర్పడనున్నాయి. జనాభా ఆధారంగా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. సగటున 1,93,358 జనాభాకు ఒక నియోజకవర్గం ఏర్పాటు కానుంది. 2011 లెక్కల ఆధారంగా ఖమ్మం జిల్లాలో 14,01,639 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10,69,261 మంది జనాభా ఉన్నారు. తద్వారా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశముంది. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు రఘునాథపాలెం మండలం ఉన్నాయి. ఇందులో రఘునాథపాలెం, ఖమ్మం కార్పొరేషన్‌లోని కొన్ని ప్రాంతాలను విడదీసి కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశముంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఒక నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : కేంద్రప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతోంది. ఈమేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా రెండు నియోజకవర్గాలు ఏర్పడతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కేంద్రం ఈ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తే సీట్ల పెంపు ప్రక్రియ మొదలుకానుంది. తద్వారా 2029 ఎన్నికలు కొత్త నియోజకవర్గాల ప్రకారమే జరగనున్నాయి.

2008లో మార్పులు, చేర్పులు

గతంలో నియోజకవర్గాల పునర్విభజన 2008లో చేపట్టారు. అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడింది. అయితే, రాష్ట్ర విభజనతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను ఏపీలో కలవగా.. చండ్రుగొండ మండలం నుంచి కొంత మేర విడదీసి అన్నపురెడ్డిపల్లి మండలం ఏర్పాటుచేశారు. ఇక బూర్గంపాడు నియోజకవర్గం రద్దు కాగా ఆ స్థానాన పినపాక వచ్చింది. అలాగే, జనరల్‌ నియోజకవర్గంగా ఉన్న సుజాతనగర్‌ రద్దయి ఎస్టీ రిజర్వ్‌ స్థానంగా వైరా ఏర్పడింది. అంతేకాక సత్తుపల్లి నియోజకవర్గం జనరల్‌ నుంచి రిజర్వ్‌గా, రిజర్వ్‌డ్‌ ఉన్న పాలేరు జనరల్‌ కేటగిరీలోకి వచ్చింది. ఆ సమయాన కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు మాత్రమే జనరల్‌ కేటగిరీలోకి మిగలగా, మిగతావన్నీ రిజర్వ్‌ అయ్యాయి.

ఒకే జిల్లాలోకి నియోజకవర్గం

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాలు రెండు నుంచి మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. త్వరలో జరిగే పునర్విభజనతో ఒక అసెంబ్లీ నియోజకవర్గమంతా ఒకే జిల్లా పరిధిలోకి రానుంది. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, వైరా, కారేపల్లి, కొణిజర్ల, ఏన్కూరు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఇక భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం ములుగు జిల్లాలో.. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాలు భద్రాద్రి కొత్తగూడెంలో కొనసాగుతున్నాయి. అంతేకాక ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలం ఖమ్మం జిల్లాలో.. ఇల్లెందు, టేకులపల్లి మండలాలు భద్రాద్రి జిల్లాలో, బయ్యారం, గార్ల మండలాలు మహబూబాబాద్‌ జిల్లాలో ఉన్నాయి. ఈసారి చేపట్టే పునర్విభజనతో నియోజకవర్గమంతా ఒకే జిల్లా పరిధిలోకి వస్తే రూపురేఖలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జిల్లా జనాభా ప్రస్తుత కొత్తగా

స్థానాలు ఏర్పడేవి

ఖమ్మం 14,01,639 05 01

భద్రాద్రి కొత్తగూడెం 10,69,261 05 01

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement