‘ప్రజాపాలన’తో భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజాపాలన’తో భవిష్యత్‌

Mar 7 2026 8:09 AM | Updated on Mar 7 2026 8:09 AM

● మెరుగైన పాలనే లక్ష్యంగా కార్యక్రమం ● రెవెన్యూ, అటవీ భూసమస్యలకు శాశ్వత పరిష్కారం ● ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా సంక్షేమానికి ప్రాధాన్యత ● ‘99 రోజుల కార్యాచరణ’ సన్నాహక సమావేశంలో మంత్రులు పొంగులేటి, శ్రీహరి ఇంకా ఎవరేం అన్నారంటే...

● మెరుగైన పాలనే లక్ష్యంగా కార్యక్రమం ● రెవెన్యూ, అటవీ భూసమస్యలకు శాశ్వత పరిష్కారం ● ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా సంక్షేమానికి ప్రాధాన్యత ● ‘99 రోజుల కార్యాచరణ’ సన్నాహక సమావేశంలో మంత్రులు పొంగులేటి, శ్రీహరి

సాక్షి ప్రతినిఽధి, ఖమ్మం: ప్రజలకు మేలైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ పేరిట చేపడుతున్న 99రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై శుక్రవారం ఉమ్మడి జిల్లాస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇది 99 రోజులకే పరిమితం కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర వేదికగా, భవిష్యత్‌ ప్రణాళికకు దిక్సూచిలా నిలుస్తుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో డ్రెయినేజీ నిర్మాణాల్లో లోపాలను సరిచేయడమే కాక ఏ అధికారి హయాంలో పొరపాటు జరిగిందో వారిని బాధ్యులుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సర్వే చేపట్టండి..

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అటవీ, రెవెన్యూ భూముల వివాదాల పరిష్కారానికి 99 రోజుల ప్రణాళికను వేదికగా చేసుకోవాలని పొంగులేటి సూచించారు. సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు తదితర నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉన్నందున కలెక్టర్లు, డీఎఫ్‌ఓలు, రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా సరిహద్దులను ఖరారు చేయాలని తెలిపారు. పది అంశాలకు సంబంధించి ప్రణాళిక క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు జరిగేలా చూడాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లకు తహసీల్దార్‌ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించి వారానికోసారి భోజన నాణ్యత పరిశీలించాలని తెలిపారు. ఏదైనా తప్పు జరిగితే సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. గ్రౌండింగ్‌ కాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆసక్తి లేకపోతే అదే గ్రామంలో మరొకరికి కేటాయించాలని సూచించారు. తద్వారా ఈనెలాఖరుకు మొదటి విడత ఇళ్లన్నీ గ్రౌండింగ్‌ చేయాలని తెలిపారు. ఇంకా వైద్యరంగం పనితీరు మెరుగయ్యేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అలాగే, జీపీలకు పెద్ద ఎత్తున వస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎకో పార్కుల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రైతులకు భూసార పరీక్షలు, పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈనెల 12న ఉమ్మడి జిల్లా పరిధిలో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని సూచించారు.

గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు...

గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళికాయుతంగా అమలు చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఆర్థిక స్థితిగతులు సహకరించకున్నా పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అర్హులకు చేర్చాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగానే ప్రజల్లో ప్రభుత్వంపై స్పందన ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, రాందాస్‌నాయక్‌, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ట, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.

●ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పంచాయతీ, మున్సిపల్‌ పాలకవర్గాలను పాలక వర్గాలను భాగస్వాములను చేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్న కోతలు సమస్య, ఆహార నాణ్యత, రైతులకు అవగాహనపై దృష్టి సారిస్తూనే ప్రభుత్వ పాఠశాలల్లో నీటి సరఫరాతో కూడిన టాయిలెట్స్‌ నిర్మించాలని తెలిపారు.

●కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఇంటి కోసం రూ.20వేలు మంజూరైన వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు తిరస్కరించకుండా అర్హులకు కేటాయించాలని సూచించారు. రెండో విడతలో అర్హులు అధికంగా ఉంటే లాటరీ పద్ధతి అనుసరించాలని తెలిపారు.

●అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే అధికారులు – ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు.

●ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్‌ మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వ సూచనల మేరకు అమలు చేస్తామని వెల్లడించారు.

●భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు ప్రతీ మండలానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. నెల కన్నా ఎక్కువ సమయం పెండింగ్‌ ఫైళ్లను పది రోజుల్లో క్లియర్‌ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement