జాగా ఇవ్వలే.. బిల్లులు రాలే..
ఖాళీ చేయించారు కానీ..
● మాడవీధుల నిర్వాసితులకు తప్పని ఎదురుచూపులు ● 90 గజాల స్థలం కోసం తొమ్మిది నెలలుగా నిరీక్షణ ● స్థలాలను చదును చేసిన కాంట్రాక్టర్లకు అందని బిల్లులు ● ప్రభుత్వం దృష్టి సారిస్తేనే సమస్యల పరిష్కారం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి మాడ వీధుల విస్తరణలో భూమి కోల్పోయిన నిర్వాసితులు ప్రభుత్వం ఇచ్చే స్థలం కోసం 9 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఆర్‌అండ్‌బీ స్థలంలో చదును చేసే పనులు చేపట్టిన, మాడవీధుల్లో ఇళ్లను తొలగించిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఇతర పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. నిర్వాసితులు, కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు.
ప్రధాన రహదారిలో కమర్షియల్ కాంప్లెక్స్
భూమిని ప్లాట్లుగా విభజించి లాటరీ పద్ధతిలో నిర్వాసితులకు కేటాయించనున్నారు. 90 గజాల చొప్పున 72 ప్లాట్లుగా విభజన చేయనున్నారు. ఇందులో 40 మంది నిర్వాసితులకు ప్రధాన రహదారి వెనుక భాగంలో 40 ప్లాట్లను అందజేయాలి. మిగిలిన 30 ప్లాట్లను కమర్షియల్ నిర్మాణానికి ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రధాన రహదారి వైపు ఉన్న ప్లాట్లను రెవెన్యూకు అప్పగించి, వారి ఆధ్వర్యంలో దుకాణాల నిర్మాణం చేపట్టి అద్దెకు ఇవ్వనున్నారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బిల్లులు చెల్లిస్తేనే ఇతర పనులు..
మాడవీధుల విస్తరణలో ఇళ్ల కూల్చివేత, శిథిలాల తొలగింపునకు సంబంధించి సుమారు రూ.78 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆర్‌అండ్‌బీ స్థలం చదును పనులకు సంబంధించి సుమారు రూ. 2.98 కోట్లు కాంట్రాక్టర్‌కు అందాల్సి ఉంది. ఈ బిల్లులు చెల్లిస్తేనే ఇతర పనులు చేపట్టే పరిస్థితి నెలకొంది. చదును చేసిన స్థలంలో రహదారుల విస్తరణ, డ్రెయినేజీల నిర్మాణం, ప్లాట్లకు సరిహద్దుల పోల్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇవి పూర్తయ్యాకే నిర్వాసితులకు జాగా అందించాలి. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం అధికారులు, ప్రభుత్వ ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు నిర్వాసితులు సైతం ప్రభుత్వం అందజేసే జాగా కోసం సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించాలని, నిర్వాసితులకు స్థలం అప్పగించాలని కోరుతున్నారు.
గత శ్రీరామనవమికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని హడావిడిగా మాడవీధుల విస్తరణకు నిర్వాసితుల కోసం రూ.60.20 కోట్లు విడుదల చేశారు. దుకాణాలు, ఇళ్లు అత్యవసరంగా ఖాళీ చేయించారు. నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసే అద్దె ఇళ్లకు తరలివెళ్లారు. వీరికోసం మెయిన్ రోడ్డులో గతంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, డివిజన్ కార్యాలయం ఉన్న భూమిని గుర్తించారు. సుమారు 3 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రతిపాదించారు. ఆ జాగాను చదును చేసే బాధ్యత కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ స్థలంలో పెద్ద పెద్ద రాళ్లు పడటంతో పనులు నెలల తరబడి సాగాయి. ఎట్టకేలకు పనులు పూర్తయినా నిర్వాసితులకు జాగా ఇవ్వలేదు.


