ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
గుండాల: పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు రాత్రి పూట ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఐటీడీఏ పీఓ రాహుల్, సూచించారు. శుక్రవారం ఆయన ఆర్‌సీఓ అరుణ కుమారితో కలిసి మండలంలోని మామకన్ను ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య, గురుకుల కళాశాల, గురుకుల పాఠశాల, గుండాల వసతీ గృహాలను తనిఖీ చేశారు. పాఠశాల, కళాశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను ఇళ్లకు పంపొద్దని, ఉపాధ్యాయులు కూడా సెలవులు పెట్టొద్దని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరీక్షలంటే విద్యార్థులకు భయం పోగొట్టాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, మెనూ పాటించాలని సూచించారు.
విక్రయానికి అనుగుణంగా పరిమాణం
ఉండాలి
ఇల్లెందురూరల్: పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకే కొనుగోలు చేసేలా పసుపు, కారం ప్యాకెట్ల పరిమాణం ఉండాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. మండలంలోని సుభాష్‌నగర్ గ్రామపంచాయతీలోని జీసీసీ పసుపు, కారం తయారీ యూనిట్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కిలో ప్యాకెట్లతోపాటు అర కిలో, పావుకిలో ప్యాకెట్లు కూడా తయారు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జీసీసీ అధికారులను ఆదేశించారు. భద్రాచలంలో గిరిజన మార్ట్ నెలకొల్పేందుకు పరిశీలిస్తున్నామని, దీనితోపాటు ఇతర మార్ట్‌లకు కూడా జీసీసీ ఉత్పత్తులను విక్రయించేందుకు సరఫరా చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. జీసీసీ మేనేజర్ మేడ భూషయ్య, ఏడీటీవో భారతీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.


