బస్టాండ్లలో ‘మేడారం’ ఏర్పాట్లు
చుంచుపల్లి/ఇల్లెందు: ములుగు జిల్లా మేడారంలో మూడు రోజులపాటు సాగే సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు ఖమ్మం రీజియన్ పరిధిలోని బస్టాండ్లలో భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్‌ఎం ఎ.సరిరామ్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం, ఇల్లెండు బస్టాండ్లలో వసతులను పరిశీలించి మాట్లాడారు. జాతరకు ముందు మూడు రోజుల నుంచే భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. భక్తులకు మరుగుదొడ్లు, తాగునీరు, నీడ వసతులు కల్పిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు. కొత్తగూడెం డిపో పరిధి నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. కొత్తగూడెం–ఇల్లెందు–గుండాల మార్గంలో, కొత్తగూడెం–పాల్వంచ–మణుగూరు–ఏటూరు నాగారం మార్గంలో సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఖమ్మం నూతన బస్టాండ్ నుంచి ఇల్లెందు– గుండాల మీదుగా 10 ప్రత్యేక బస్‌లు, ఇల్లెందు నుంచి గుండాల మీదుగా 31 బస్సులు నడుపుతామని తెలిపారు. డిప్యూటీ ఆర్‌ఎం మల్లయ్య, డీఎంలు శివప్రసాద్, రాజ్యలక్ష్మి, ఏడీసీ రవీంద్రనాధ్, గౌతమి, వై.ఎన్ రావు, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం బస్టాండ్‌లో పరిశీలిస్తున్న
ఆర్‌ఎం సరిరామ్
ఆర్టీసీ ఆర్‌ఎం సరిరామ్


