ఓసీ–2లో రెండు డంపర్లు ఢీ
మణుగూరు టౌన్: మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ–2లో శనివారం బీ–రిలేలో భోజన సమయంలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఓ డంపర్‌ను మరో డంపర్ వెనుక నుంచి ఢీకొట్టింది. డంపర్ల వేగం తక్కువగా ఉండటంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హాల్ రోడ్‌పై నీళ్లు చల్లకపోవడంతో దుమ్ము లేచిందని, దీంతో దారి కనపడక ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
కారు, బైక్ ఢీ
● నలుగురికి గాయాలు
అశ్వారావుపేటరూరల్: కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటన ఆదివారం పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పండువారిగూడేనికి చెందిన మడకం రాజు, అదే గ్రామానికి చెందిన కోర్సా సుజాత, ఏడాది వయస్సుగల చిన్నారి శివ పార్వతి కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అశ్వారావుపేటలోని హెచ్‌పీ గ్యాస్ కార్యాలయం వద్ద అదుపుతప్పి ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో బైక్‌పై ముగ్గురికి, కారులో ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి. కారు ముందు భాగం దెబ్బతిన్నది. క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం తరలించారు.
అదుపు తప్పి
కల్వర్టు ఎక్కిన కారు
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టు గోడపైకి ఎక్కింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. కల్వర్టులు, వంతెనల వద్ద తరచూ ప్రమాదాలు జరగుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం రక్షణ చర్యలు చేపట్టడం లేదు.
ఓసీ–2లో రెండు డంపర్లు ఢీ


