అలరించిన సైన్స్‌ఫేర్
ఆకట్టుకున్న విద్యార్థుల ప్రాజెక్టులు
ఆలోచింపజేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం సెయింట్ మెరీస్ పాఠశాలలో బుధవారం కొనసాగిన జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌లో విద్యార్థులు తయారుచేసిన వైజ్ఞానిక ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. వీటిని తిలకించేందుకు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు.
● ఏడూళ్ల బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.జశ్వంత్ రూపొందించిన ‘స్మార్ట్ వ్యవసాయం’ ప్రాజెక్టు ఔరా అనిపించింది. వరి కోతలు పూర్తయ్యాక ధాన్యాన్ని వేరు చేసి గడ్డిని కాల్చితే గాలి కాలుష్యం అవుతుందని, కాల్చకుండా రీసైక్లింగ్‌తో పశువులకు దాణాగా వినియోగించవచ్చనే ప్రాజెక్టు ఆలోచింపజేసింది.
● పాల్వంచ కేజీబీవీ విద్యార్థిని బి.ఎక్షిత ప్రదర్శించిన ‘బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్’ ప్రాజెక్టు ఆకట్టుకుంది.
● చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థిని బి.హెలన్మారస్ సీపీఆర్ ఎలా చేయడం, ఉపయోగాలు తెలుపుతూ ప్రాజెక్టు ప్రదర్శించింది.
● మణుగూరు సింగరేణి పాఠశాల విద్యార్థి ఎ.సంజయ్ పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఇంజనీర్లు బహుళ అంతస్తుల భవనాలు ఎలా నిర్మిస్తున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారనే అంశాలపై ప్రాజెక్టు రూపొందించాడు.
● కరకగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్‌కే.నక్షా, ఇర్ఫాన్‌ఖాన్ ఎక్స్‌లెంట్ లైటింగ్ సిస్టమ్ ప్రాజెక్టును రూపొందించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఇతర పార్కింగ్ స్థలాల్లో రాత్రంతా లైట్లు వెలిగే ఉంటాయి. అలా కాకుండా వాహనం వచ్చినప్పడే లైట్లు వెలగడం, మిగతా సమయంలో ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే సిస్టమ్‌తో విద్యుత్ ఆదా చేసుకోవచ్చని వివరించారు. ఇంకా ఇల్లెందు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎ.నిక్షిత్, ములకలపల్లి పీఎంశ్రీ పాఠశాల విద్యార్థిని ఎం.మానస తదితరులు కూడా అద్భుత ప్రదర్శనలు చేశారు.
సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి
విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సైన్స్‌ఫేర్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉన్నాయని, మిగిలిన విద్యార్థులు కూడా ఈ రంగంలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. సైన్స్‌ఫేర్లతో విద్యార్థుల్లో వైజ్ఞానిక పరిజ్ఞానం, తాత్విక ఆలోచనలు, సృజనాత్మక పెరుగుతాయని చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖలోని వివిధ విభాగాల అధికారులు మాధవరావు, సతీష్, సైదులు, నాగరాజశేఖర్, నీరజ, ఎంఈఓలు మధురవాణి, బాలాజీ, ఝుంకీలాల్, కృష్ణయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉత్తమ ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థులకు నేడు బహుమతులు పంపిణీ చేయనున్నారు.
జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌లో పాల్గొనడం ఇది రెండోసారి. ఈ సంవత్సరం డిటెక్టివ్ వార్నింగ్ వాయిస్ అనే ప్రాజెక్టు ప్రదర్శించాను. సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. వచ్చే ఏడాది కూడా జిల్లాలో ఎక్కడ పెట్టినా మరో నూతన ఆవిష్కరణ రూపొందించి పాల్గొంటా.
– జి.కల్కి, పాల్వంచ
సైన్స్‌ఫేర్‌లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. చాలామంది విద్యార్థులు కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రదర్శించారు. వారందరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మహిళలంతా రబ్బర్ బ్యాండ్‌లు ఉపయోగిస్తారు. అయితే సేఫ్టీ రబ్బర్ బ్యాండ్‌ను ఎలా ఉపయోగించాలనే అంశంపై ప్రాజెక్టు రూపొందించాను.
– ఎం.తేజస్వి, టేకులపల్లి
అలరించిన సైన్స్‌ఫేర్
అలరించిన సైన్స్‌ఫేర్
అలరించిన సైన్స్‌ఫేర్
అలరించిన సైన్స్‌ఫేర్


