తొలి పోరుకు సిద్ధం
● నేటి నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ● 47 కేంద్రాలు ఏర్పాటు ● మొదటి విడతలో 159 జీపీలు, 1,436 వార్డు స్థానాలు
చుంచుపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నేటి నుంచి 29వ తేదీ వరకు, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ కార్యక్రమాలు నిర్వహించి డిసెంబర్ 3న బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈ బాధ్యతలను స్టేజ్–1, స్టేజ్–2 అధికారులకు అప్పగించారు. నామినేషన్ దాఖలు చేసే సర్పంచ్ అభ్యర్థులు జనరల్ స్థానానికి రూ. 2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్‌డ్ స్థానాలకు రూ.1,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. వార్డు స్థానాలకు జనరల్ రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల్లో రూ.500గా నిర్ణయించారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు తమ పూర్తి వివరాలు పొందుపర్చాలి. తొలి విడతలో అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,436 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించాక, 2 గంటలకు లెక్కింపు ప్రారంభించి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.
47 కేంద్రాల్లో నామినేషన్లు..
మొదటి విడతలో ఎన్నికలు జరిగే 159 గ్రామ పంచాయతీలు, 1,436 వార్డు స్థానాలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించేందుకు 47 కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాచలం పంచాయతీ నామినేషన్లను మాత్రం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్వీకరిస్తారు. బూర్గంపాడు మండలంలోని 18 గ్రామపంచాయతీల నామినేషన్లను ఇరవెండి, సారపాక, నాగినేనిప్రోలు, బూర్గంపాడు, ముసలిమడుగు, లక్ష్మీపురం, మోరంపల్లి బంజర, పినపాక పట్టీనగర్‌లో స్వీకరిస్తారు. చర్ల మండలంలోని 26 పంచాయతీలకు గాను సుబ్బంపేట, మొగళ్లపల్లి, చర్ల, తేగడ, పెద్ద మిడిసిలేరు, ఆర్ కొత్తగూడెం, దేవరపల్లిలో, అశ్వాపురం మండలంలోని 24 జీపీల నామినేషన్లను మిట్టగూడెం, అశ్వాపురం, ఆమెర్ద, గొల్లగూడెం, గొందిగూడెం, తుమ్మలచెరువు, మొండికుంటలో, దుమ్ముగూడెం మండలంలోని 37 పంచాయతీలకు నర్సాపురం, రామారావుపేట, లకీ్‌ష్మ్‌నగరం, పర్ణశాల, పెద్దనల్లబల్లి, ప్రగళ్లపల్లి, ఆర్లగూడెం, మారాయిగూడెంలో, కరకగూడెం మండలంలోని 16 జీపీలకు కరకగూడెం, సమత్ మోతేలో, పినపాకలోని 23 పంచాయతీలకు పినపాక, సీతంపేట, ఈ బయ్యారం, జగ్గారం, జానంపేట, దుగినేపల్లిలో, మణుగూరు మండలంలోని 14 పంచాయతీలకు పగిడేరు, సాంబాయిగూడెం, రామానుజవరం, లంకమల్లారం, తోగ్గూడెం, ఇప్పలసింగారం, కూనవరం, సమితిసింగారం కేంద్రాల్లో స్వీకరిస్తారు. ఒక్కో కేంద్రంలో ఆర్‌ఓ, ఏఆర్‌ఓతో పాటు మరో సిబ్బంది విధుల్లో ఉంటారు. మొదటి విడత పోలింగ్ జరిగే స్థానాలకు ఎన్నికల సామగ్రిని తరలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారని, అభ్యర్థులు ఈసీ సూచించిన వివరాలన్నీ నామినేషన్ పత్రాల్లో పొందుపర్చాలని ఇన్‌చార్జ్ డీపీఓ సుధీర్ తెలిపారు.
తొలి పోరుకు సిద్ధం


