ఎన్నికలు సమర్థంగా నిర్వహిస్తాం
● సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ● జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థంగా నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. మొదటి విడతలో మారుమూల, సమస్యాత్మక ప్రాంతాలను ప్రాధాన్యంగా తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 4,242 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, నామినేషన్ల స్వీకరణకు 137 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, అయితే మున్సిపాలిటీ ప్రాంతాలకు వర్తించదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల ను వెల్లడించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం జిల్లా పర్యటన ఉంటుందా అని ప్రశ్నించగా మున్సిపాలిటీ లో కాబట్టి ఉంటుందని చెప్పారు.
ఎన్నికలకు సిద్ధం కండి..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధల ప్రకారం ఎన్నికల విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. స్థానిక న్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాలని, పరస్పర సమన్వయంతో పోలింగ్ సాఫీగా సాగేలా కృషి చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలన్నారు. కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీల హోర్డింగులు, పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని చెప్పారు. మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలపై నిఘా ఉంచాలని అన్నారు. ఓటరు జాబితాను మరోమారు నిశితంగా పరిశీలించాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ పాల్గొన్నారు.


