ఏజెన్సీలో వైద్య సేవలు భేష్
ఇల్లెందు: ఏజెన్సీలో మెరుగైన వైద్య సేవలందుతున్నాయని కేంద్ర వైద్య సేవలు, ప్రమాణాల తనిఖీ కామన్ రివ్యూ మిషన్(సీఆర్‌ఎం) బృందం కితాబిచ్చింది. కేంద్ర బృందం ఇటీవల సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. జిల్లాలోని పలు ఆస్పత్రులను సందర్శించి పరిశీలించింది. భద్రాచలం, ఇల్లెందు ఆస్పత్రుల్లో వైద్యుల, సిబ్బంది పని తీరు మెరుగ్గా ఉందని పేర్కొంది. తనిఖీ అనంతరం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ, రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావించింది. సిబ్బంది అంకిత భావంతో పని చేయటంతో రోగులకు ఉత్తమ సేవలు అందుతున్నాయని తెలిపింది. పలు అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. జిల్లాలో పర్యటించిన సీఆర్‌ఎం బృందంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం, ఇల్లెందు ఆస్పత్రులకు కితాబు


