
ఊరూరా ఉపాధి గుర్తింపు
జిల్లాలో ఉపాధి హామీ పథకం వివరాలు
పనుల ఎంపికకు ఇటీవల ప్రారంభమైన గ్రామసభలు జాతీయ ఉపాధి హామీలో జల సంరక్షణకు ప్రాధాన్యం
చుంచుపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల గుర్తింపునకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన సభలు నవంబర్ 30లోగా పూర్తిచేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో చేపట్టబోయే ఉపాధి పనుల గుర్తింపునకు, ఎక్కువ మంది కూలీలకు పని కల్పించేలా డీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధిహామీ ఏపీఓలు, సాంకేతిక సహాయకులు, కార్యదర్శులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనుల వివరాలు సేకరిస్తున్నారు. గ్రామసభల్లో పనులపై చర్చించి ఆమోదం పొందనున్నారు. ఉపాధి సిబ్బంది లేబర్ బడ్జెట్‌ను అంచనా వేస్తారు. ఈసారి జలవనరుల సంరక్షణతోపాటు రైతులకు, కూలీలకు ఎక్కువగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గుర్తించిన పనులకు బడ్జెట్ రూపొందించి, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆమోదించాక కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే వచ్చే ఏప్రిల్ నుంచి లేబర్ బడ్జెట్ ఆధారంగా జిల్లాలో ఉపాధి పనులను చేట్టనున్నారు.
గ్రామసభల్లో చర్చించి..
గ్రామసభల్లో తమకు అవసరమైన పనులను ఎంపిక చేసుకునే వెసులుబాటు గ్రామస్తులకు, రైతు సంఘాలకు ఉంటుంది. ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామసభలకు హాజౖ రె చేపట్టబోయే పనులపై గ్రామస్తులతో చర్చిస్తారు. తర్వాత ఇంజనీరింగ్ కన్సల్‌టెంట్లు అంచనాలు రూపొందిస్తారు. మొదట గ్రామస్థాయిలో నివేదికలు ఆమోదించాక, మండల, జిల్లా స్థాయికి పంపించాలి. జిల్లాస్థాయి వార్షిక ప్రణాళికలను 2026 జనవరిలో, అదే నెలలో రాష్ట్రస్థాయిలో ఆమోదిస్తారు. మార్చి 31న కేంద్రం ప్రభుత్వం లేబర్ బడ్జెట్‌ను ప్రకటిస్తుంది. దీనికి అనుగుణంగా పంచాయతీల వారీగా గ్రామసభలను నిర్వహించి కావాల్సిన పనులను గుర్తించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు.
మొత్తం జాబ్‌కార్డులు 2.23 లక్షలు
యాక్ట్టివ్ జాబ్ కార్డులు 1.31 లక్షలు
మొత్తం కూలీలు 4.58 లక్షలు
యాక్టివ్ కూలీలు 2.21 లక్షలు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు కసరత్తు