
మధ్యవర్తిత్వమే ప్రాణం తీసిందా?
● రూ. 40 లక్షలు వసూలు చేసి మరొకరికి అప్పగింత ● ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని బాధితుల ఒత్తిడి ● గత మే నెలలో అనారోగ్యంతో మృతి ● 2024లో తీసుకున్న ఆత్మహత్య సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి
పాల్వంచ: కేటీపీఎస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలతో నిరుద్యోగులకు వల వేసి రూ. లక్షలు వసూళ్లు చేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తిపై ఒత్తిడి పెరిగింది. దీంతో మనోవేదన చెంది అనారోగ్యం బారిన పడి గత మే నెలలో అతను మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని 2024లో తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూడగా, పట్టణంలో చర్చాంశనీయంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పాత పాల్వంచ గడియ కట్టకు చెందిన అనుముల సైదులు(37) మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరంతో గత మే 12న మృతి చెందాడు. సైదులు పాత పాల్వంచకు చెందిన కొలిపాక శ్రీనివాస్ మాటలు నమ్మి మధ్యవర్తిత్వం వహించి నిరుద్యోగుల నుంచి రూ. లక్షలు వసూళ్లు చేశాడు. తొలుత అతనే ఉద్యోగం కోసం శ్రీనివాస్‌కు రూ.8లక్షలు ఇచ్చాడు. అనంతరం అతని బావమరిది నుంచి రూ.5లక్షలు, హరీష్, లక్ష్మణ్, సతీష్, సాయి, మరో ఇద్దరు మహిళలు, మరో బంధువు నుంచి ఇలా మొత్తం రూ.40 లక్షల వరకు వసూలు చేసి శ్రీనివాస్‌కు ఇచ్చాడు. ఉద్యోగాలు ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉన్నాయంటూ శ్రీనివాస్ కాలయాపన చేశాడు. దీంతో డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగి సైదులు మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో మనోవేదన చెంది మృతి చెందాడని కుటుంబీకులు చెబుతున్నారు.
కారకులపై చర్యలు తీసుకోవాలి..
సెల్ఫీ వీడియోలో డబ్బులు ఎవరెవరి వద్ద ఎంత తీసుకున్న, ఎవరికీ ఇచ్చింది మొత్తం వివరించాడు. ఈ విషయంలో ఎస్పీ రోహిత్ రాజు స్పందించి న్యాయం చేయాలని కోరాడు. తనను శ్రీనివాస్ మోసం చేయడం వల్లే చనిపోతున్నానని తెలిపాడు. శనివారం మృతుడు సైదులు భార్య స్వర్ణమణి విలేకరులతో మాట్లాడుతూ శ్రీనివాస్ మోసం చేయడంతో డబ్బులు ఇచ్చినవారు ఒత్తిడి చేశారని, దీంతో మనవేదనకు గురై మృతి చెందాడని తెలిపింది. తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, తన భర్త మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయమై ఎస్‌ఐ సుమన్‌ను వివరణ కోరగా.. ఈ వ్యవహారం ఫిర్యాదు రాలేదని తెలిపారు. 2024 సంవత్సరంలో సైదులు సెల్ఫీ వీడియో తీసుకున్నాడని, 2025 మేలో అతను జ్వరంతో చనిపోయాడని పేర్కొన్నారు.

మధ్యవర్తిత్వమే ప్రాణం తీసిందా?