
ఐరన్ లారీ, డీసీఎం ఢీ
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
దమ్మపేట : ఐరన్ లారీని సీఎం వ్యాన్ ఢీకొని డ్రైవర్ గాయపడ్డ ఘటన మండలంలోని మొద్దులగూడెం గ్రామ శివారులో శనివారం జరిగింది.స్థానికుల కథనం ప్రకారం... అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపు ఐరన్ లోడ్‌తో లారీ వెళ్తోంది. ఈ క్రమంలో మొద్దులగూడెం శివారు వద్ద అదే మార్గంలో వెళ్తున్న డీసీఎం వ్యాను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్ ద్వారా సత్తుపల్లి తరలించారు. డీసీఎం ముందు భాగమంతా నుజ్జునుజ్జయింది.
నగదు చోరీపై కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: నగదు చోరీ ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై యయాతీ రాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్సార్ కాలనీకి చెందిన గన్నవరపు రాజారావు (దాబా రాజు) శుక్రవారం ఎస్‌బీఐ బ్యాంక్‌లో మద్యం దుకాణానికి డీడీ తీసేందుకు రూ.2.50 లక్షల నగదును తన ద్విచక్రవాహనానికి తగిలించిన సంచిలో పెట్టి సమీపంలోనే ఉన్న ఓ బ్యాంక్ మిత్ర వద్దకు వెళ్లాడు. బ్యాంక్ మిత్ర వద్ద మరో రూ.50 వేలు డ్రా చేస్తున్న క్రమంలోనే గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి నగదు ఉన్న సంచిని కాజేశారు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆయా ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నగదు కాజేసి పారిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇసుక లారీ సీజ్
బూర్గంపాడు: మండల పరిధిలోని జింకలగూడెం గ్రామ సమీపంలోని కిన్నెరసాని కెనాల్ వద్ద నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు ఎస్‌ఐ మేడ ప్రసాద్ తెలిపారు. లారీ ఓనర్, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ములకలపల్లిలో ట్రాక్టర్..
ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై ఎస్ మధుప్రసాద్ కథనం మేరకు .. మండల పరిధిలోని సీతారాంపురం శివారులో ముర్రేడు వాగు నుంచి ఇసుక అక్రమంగా తోలుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్పై తెలిపారు.
చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి
బోనకల్: మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి కుంచం సందీప్ (16) శనివారం మృతిచెందాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల అనంతరం కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక ఇటీవల గడ్డిమందు తాగాడు. దీంతో గుర్తించిన ఆయన తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు.