
చిక్కులకు చెక్ !
నిత్యం ట్రాఫిక్ జామ్..
త్వరలో న్యూగొల్లగూడెం రోడ్డు విస్తరణ
అవసరమైన స్థలం ఇచ్చేందుకు రైల్వే శాఖ అంగీకారం
బదులుగా ఖమ్మంలో ఎకరం స్థలం కేటాయింపు
సాక్షి ప్రతినిఽధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి జిల్లా అధికారులు రైల్వే శాఖతో చర్చించగా.. సానుకూల ఫలితం వచ్చింది. దీంతో ఎదురుగడ్డ – హేమచంద్రాపురం రోడ్డు విస్తరణకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ఆరంభంలోనే బాటిల్ నెక్‌గా ఉన్న స్టేషన్ ప్రహరీని వెనక్కు జరిపేందుకు రైల్వే శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
విస్తరణకు రైల్వే అడ్డంకి..
ఈ రహదారి విస్తరణకు గడిచిన ఐదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సూపర్‌బజార్ – న్యూగొల్లగూడెం రోడ్డుకు ఒకవైపు భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్ ప్రహరీ ఉండగా.. మరోవైపు బడే మసీద్‌తో పాటు చిన్నబజార్, పెద్దబజార్, నేతాజీ మార్కెట్‌లకు సంబంధించిన దుకాణ సముదాయాలు ఉన్నాయి. దీంతో ఈ రోడ్డును విస్తరించడం కష్టంగా మారింది. పలుమార్లు నిధులు మంజూరైనా తన పరిధిలోని స్థలాన్ని ఇచ్చేందుకు రైల్వే శాఖ అంగీకారం తెలపలేదు. దీంతో రైల్వే ప్రహ రీ దాటిన తర్వాతనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణకు తాము కోల్పేయే స్థలానికి పరిహారంగా మరో చోట స్థలం ఇవ్వాలంటూ రైల్వేశాఖ సూచనలు చేసింది. దీంతో గతేడాది కారేపల్లి మండలంలో 15 ఎకరాల స్థలాన్ని పరిశీలించినా రైల్వేబోర్డు నుంచి సానుకూల స్పందన రాలేదు.
ఖమ్మంలో ఎకరం..
రోడ్డు విస్తరణ కోసం రైల్వేశాఖకు అనువైన స్థలం ఇచ్చేందుకు ఏడాది కాలంగా పలు స్థలాలను పరిశీలించారు. చివరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ ఏరియాలో నిరుపయోగంగా ఉన్న ఎకరం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. రైల్వే ట్రాక్‌కు పక్కనే ఉన్న ఈ స్థలం తీసుకునేందుకు రైల్వేశాఖ సైతం సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు బదులుగా కొత్తగూడెంలోని రైల్వే స్టేషన్ ఆరంభం నుంచి నేతాజీ మార్కెట్ వరకు 540 గజాల స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రోడ్డును పది గజాల మేరకు విస్తరించే వీలు కలిగింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం రైల్వేశాఖతో లిఖితపూర్వక సంప్రదింపులు ప్రారంభించింది. లాంఛనాలన్నీ పూర్తయితే అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కానుంది. ఈ రోడ్డు విస్తరణ కోసం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి రైల్వేశాఖతో పలుమార్లు చర్చించారు.
ఆర్టీసీ బస్సులకూ అవకాశం..
గతంలో కొత్తగూడెం – ఇల్లెందు మధ్య నడిచే ఆర్టీసీ సర్వీసుల్లో కొన్నింటిని హేమచంద్రాపురం – కారుకొండ రామవరం మీదుగా నడపాలనే ప్రయత్నాలు జరిగాయి. అయితే రైల్వేస్టేషన్ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అవకాశం కలుగుతుంది. తద్వారా ఈ మార్గంలో ఉన్న గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగవడంతో పాటు మహాలక్ష్మి పథకం మరింత చేరువవుతుంది. అంతేకాక ఈ మార్గం ఇల్లెందు, టేకులపల్లికి దగ్గరి దారిగా కూడా ఉంటుంది. ఇల్లెందు క్రాస్‌రోడ్‌తో పోల్చితే కనీసం ఐదు కిలోమీటర్ల దూరాభారం తగ్గుతుంది.
కొత్తగూడెం నగరంలో సూపర్‌బజార్ సెంటర్ ప్రధాన కూడలిగా ఉంది. ముఖ్యంగా భద్రాచలంరోడ్ స్టేషన్ ప్రాంగణానికి సమీపంలో చిన్న బజార్, పెద్దబజార్, నేతాజీ మార్కెట్ ఏరియాలు ఉన్నాయి. ఈ మార్కెట్‌లో ఉన్న దుకాణాలకు అవసరమైన సరుకులను నిల్వ చేసే గోదాములు ఇదే రోడ్డులోని న్యూగొల్లగూడెం – ఎదురుగడ్డ – హేమచంద్రాపురం వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఈ రహదారి 30 ఫీట్లకు మించి లేకపోవడంతో సగటున ప్రతీ ఇరవై నిమిషాలకు ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల ప్రాంతంలో, సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ఈ మార్గంలో ప్రయాణం చేయడమంటే కత్తిమీద సామే అవుతోంది. రాత్రి 8 గంటలకు సింగరేణి రైలు వచ్చినప్పుడైతే ఈ రోడ్డు, సూపర్‌బజార్ సెంటర్‌లో ఏర్పడే ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది.
రైల్వే స్టేషన్ సమీపంలో పరిష్కారం కానున్న ట్రాఫిక్ సమస్య