
యూనివర్సిటీ అభివృద్ధి అందరి బాధ్యత
ఖమ్మం సహకారనగర్: యూనివర్సిటీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని.. తద్వారా బోధన, పరిశోధనల్లో అగ్రగామిగా నిలుస్తామని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి తెలిపారు. ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, తరగతి గదులు, బోధనను పరిశీలించాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. అధ్యాపకులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, తద్వారా వారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని తెలిపారు. ప్రిన్సిపాల్ రవికుమార్, అధ్యాపకులు, ఉద్యోగులు శ్రీనివాస్, రవి, కె.వెంకటనరసయ్య పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగస్వాములు కావాలి
ఖమ్మం రాపర్తినగర్: ప్రతీ విద్యార్థి జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్)లో భాగస్వాములయ్యేలా అధ్యాపకులు అవగాహన కల్పించాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాపరెడ్డి సూచించారు. ఖమ్మంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌పై విద్యార్థులు ఆసక్తి పెంచుకునేలా అధ్యాపకులు చొరవ చూపాలన్నారు. యూనివర్సిటీ పరిధిలో అత్యధికంగా కళాశాలలు కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అవసరమైన నిధులు కేటాయిస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఎన్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడినా.. గత ఏడాది నుంచి విస్తృతం చేశామన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, ఖమ్మం జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ ఎం.శ్రీనివాసరావు మాట్లాడారు. భద్రాద్రి జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆనంద్‌బాబు, ప్రియదర్శిని, గాయత్రి డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు నవీన్‌బాబు, కె.సునీల్‌కుమార్, డైరెక్టర్ కుటుంబరావు, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు విల్సన్, ఎస్.జయప్రద తదితరులు పాల్గొన్నారు.
కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రతాపరెడ్డి