
ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి
ప్రధానోపాధ్యాయులు
ప్రధాన పాత్ర పోషించాలి..
అధికారులకు కలెక్టర్ ఆదేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందని, అందులో సన్నరకం 2,02,862 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 35,315 మెట్రిక్ టన్నులు ఉంటాయని తెలిపారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 193 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవసరమైతే అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్వం క్వింటా రూ. 2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, సన్న ధాన్యానికి అదనంగా రూ. 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేసి మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను అకారణంగా ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆయా శాఖల అధికారులు రుక్మిణి, త్రినాథ్‌బాబు, శ్రీనివాస్, బాబురావు, వెంకటరమణ, మనోహర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ భవన సందర్శన
కొత్తగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రామవరం క్యాంపస్‌ని హాస్టల్ భవనాన్ని కలెక్టర్ పాటిల్ మంగళవారం సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల స్థలానికి హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు సూచించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ సంక్షేమాధికారులు విజయలక్ష్మి, శ్రీలత, బీసీ గురుకుల ఆర్‌సీఓ రాంబాబు, సతీష్‌కుమార్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
మానవ అక్రమ రవాణాను నిర్మూలిద్దాం
కొత్తగూడెంఅర్బన్: మనుషుల అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవ అక్రమ రవాణా చాలా పద్ధతుల్లో జరుగుతోందని, అందరం కలిసి నివారించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంఓ నాగరాజు, ప్రజ్వల కో–ఆర్డినేటర్ శ్రావ్యశృతి తదితరులు మాట్లాడగా చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
పిల్లల సామర్థ్యాల పెంపుదలలో ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి తన బాధ్యత అని, పిల్లల సామర్థ్యాల పెంపుదల కోసం కృషి చేసేలా ఉపాధ్యాయులను ఉత్తేజ పరచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. నిరంతరం ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ ఉతమ ఫలితాలు రాబట్టేలా చూడాలని కోరారు. పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.