
వాణి వినేవారేరి?
డివిజన్ కేంద్రాల్లో మసకబారుతున్న గ్రీవెన్స్
హాజరు కాని అన్ని శాఖల అధికారులు
కలెక్టరేట్‌లోనే నిర్వహించాలని కోరుతున్న ప్రజలు
కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉండాలని విన్నపం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం మసకబారుతోంది. తమ సమస్యలు నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్న ప్రజలకు ప్రజావాణి కార్యక్రమం వేదికగా మారింది. అయితే గత కొంతకాలంగా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ రద్దుచేసి ప్రజల సౌకర్యార్థం కొత్తగూడెం, భద్రాచలంలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు డివిజన్ స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో మాజరు కాకపోతుండగా ప్రజలు సైతం వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. కొంతమంది కలెక్టరేట్‌కు వెళ్లి ఇన్‌వార్డులో ఫిర్యాదులు ఇస్తున్నా వాటిని అధికారులు అంతగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించినప్పుడు జిల్లా నలుమూలల నుంచి వచ్చి సమస్యలపై దరఖాస్తులు అందజేసేవారు. నేరుగా కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్‌కు సమస్యలు చెబితే అవి వెంటనే పరిష్కారం అయ్యేవి. ఒకవేళ మండలస్థాయి సమస్య అయితే సంబంధిత తహసీల్దార్ లేదా ఎంపీడీఓ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సమస్య వివరించి దరఖాస్తులను వారికి ఎండార్స్ చేసేవారు. దీంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేవారు సంతృప్తి చెందేవారు.
అందుబాటులో ఉండని అధికారులు..
ఇటీవలి కాలంలో జిల్లా ఉన్నతాధికారులు తరచూ వివిధ పనులపై జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్తుండడంతో కలెక్టరేట్‌లో అందుబాటులో ఉండడం లేదు. దీనికి తోడు ప్రజల సౌకర్యార్థం అంటూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ కూడా డివిజన్ స్థాయి అధికారులు కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి అధికారులు, సిబ్బంది మాత్రమే వినతులు స్వీకరిస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు ప్రజలు అటు వెళ్లేందుకే ఆసక్తి చూపకపోగా.. ప్రజావాణి కార్యక్రమాలు వెలవెలబోతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించాలని, నేరుగా కలెక్టరే వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించాలి. ప్రజలు ఎంతో ఆసక్తితో ప్రజావాణి కోసం ఎదురు చూసేవారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించేవారు. వందలాది మంది వచ్చి దరఖాస్తులను అందజేసే వారు. కలెక్టర్ స్పందించి ప్రజావాణిని కలెక్టరేట్‌లోనే నిర్వహించాలి.
– గూడ విజయ, కూలీలైన్, కొత్తగూడెం
పేదల సమస్యలకు పరిష్కా వేదికగా ఉన్న ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోనే కొనసాగించాలి. వందలాది మంది ప్రజావాణి కోసం ప్రతి సోమవారం ఎదురుచూస్తుంటారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్‌లు సక్రమంగా జరగడం లేదు. కలెక్టర్ స్పందించి ప్రతి సోమవారం ప్రజావాణిని కలెక్టరేట్‌లోనే కొనసాగించాలి.
– బి. లాలు, గుండాల
కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించకపోవడంతో నిరాశగా ఉంది. కలెక్టరేట్‌కు వస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యేవి. ఇటీవల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించక పోవడంతో చాలామంది అసంతృప్తికి లోనవుతున్నారు. కలెక్టర్ స్పందించి ప్రజావాణి నిర్వహించాలని కోరుతున్నాం. – ముర్రం వీరభద్రం, కొత్తపల్లి,
దుమ్ముగూడెం మండలం

వాణి వినేవారేరి?

వాణి వినేవారేరి?

వాణి వినేవారేరి?

వాణి వినేవారేరి?