
చారిత్రక సభకు సన్నద్ధం కావాలి
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శత వసంత ఉత్సవాల ముగింపు సభ డిసెంబర్ 26న జరగనున్నందున పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. ఖమ్మంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం కర్నాటి భానుప్రసాద్ అధ్యక్షతన మంగళవారం జరగగా ఆయన మాట్లాడారు. వందేళ్ల కమ్యూనిస్టుల పోరాట చరిత్ర, త్యాగాలను నేటి తరానికి తెలియజేసేందుకు శత వసంత సంబరాల ముగింపు వేడుకలను ఖమ్మంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. లక్షలాది మందితో జరిగే బహిరంగసభకు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రజలు తరలివచ్చేలా ప్రత్యేక కళారూపాలతో ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. కాగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని పార్టీలు దొంగాట ఆడుతున్నాయని ఆరోపించిన కూనంనేని... బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేలా జరిగే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈసమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని