
ఉపాధిలో ఈకేవైసీ
ఉపాధి హామీ పథకం వివరాలు
అక్రమాలకు చెక్ పెట్టేందుకు
ప్రభుత్వం చర్యలు
కూలీల ఆధార్‌కార్డు, జాబ్‌కార్డుల
వివరాలు యాప్‌లో నమోదు
జిల్లాలో కొనసాగుతున్న
ఈకేవైసీ ప్రక్రియ
వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం
గత నెల 24 నుంచి నమోదు..
చర్ల/చుంచుపల్లి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి కూలీల ఈకేవైసీ నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోంది. కూలీలు ఆధార్‌కార్డులను జాబ్‌కార్డులతో ఈ కేవైసీ చేసుకుంటేనే అక్టోబరు నుంచి ఉపాధి పనులు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎన్‌ఆర్‌ఈజీఏస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉపాధికూలీ ఆధార్, ఉపాధికార్డు వివరాలను నమోదు చేసి కూలీ ముఖగుర్తింపు ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కూలీలు తమ ఆధార్, జాబ్‌కార్డులతో ఉపాధిహామీ సిబ్బందిని కలి స్తే ఈకేవైసీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందుకోసం కూలీలు ఆధార్‌కార్డును తప్పనిసరిగా అప్డే ట్ చేసుకుని ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేయని కూలీలు ఇక నుంచి ఉపాధి పనుల్లో అవకాశం కోల్పోతారు.
అవకతవకలను నిరోధించేందుకు..
కూలీల హాజరును నేషనల్ మోబైల్ మానిటరింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కొందరు క్షేత్ర సహాయకులు నకిలీ ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ, నిధులు స్వాహా చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు, ఒకరి పేరు మీద మరొ కరు వెళ్తున్నట్లు నమోదు చేస్తున్నట్లు తేలింది. మరో వైపు సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయట పడటం, రికవరీలు జరుగుతున్నా ఏ మాత్రం మార్పు కనిపించడంలేదు. ఈ క్రమంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఎన్‌ఎంఎంఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని సైతం దుర్వినియోగం చేస్తున్న ట్లు అధికారులు గుర్తించారు. ఇతర చిత్రాలతోపాటు పని చేయకపోయినా చేసినట్లు అప్‌లోడ్ చేస్తున్నట్లు అనేక చోట్ల తేలింది. దీంతో కూలీలకు కూలీ గిట్టుబా టు కాక ఆశించిన స్థాయిలో వేతనాలు సైతం రావడంలేదు. గతంలో జాబ్‌కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానంచేసినా కొన్ని చోట్ల హాజరు నమోదులో తప్పిదా లు చేస్తున్నట్లు తేలింది. దీంతో వీటన్నింటికీ చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది.
హాజరు నమోదు ఇలా..
యాక్టీవ్ కూలీల వివరాలను మొబైల్ యాప్‌లో నమో దు చేసి, పనికి రాగానే, పని పూర్తయ్యాక రెండుసార్లు ముఖ గుర్తింపు ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. ఫొటోలు పనిప్రదేశంలోనేతీయాలి. కూలీలవివరాలు యాప్ లో నమోదు కాకపోతే ఉపాధి పనికి వెళ్లినా హాజరు పడదు. దీంతో కూలీ డబ్బులు ఖాతాల్లో జమ కావు. వేరే ప్రాంతంలో ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే జీపీఎస్ సిస్టం ద్వారా అది తప్పుడు హాజరని నిర్ధారిస్తుంది. ఈ పద్ధతి ద్వారా ఉపాధి హామీ పథకంలో అవకతవకలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
జాబ్‌కార్డులు 2.23 లక్షలు
మొత్తం కూలీలు 4.58 లక్షల మంది
యాక్టివ్ కూలీలు 2.21 లక్షల మంది
ఈకేవైసీ చేసినవారు 1.09 లక్షల మంది
ఇంకా చేయాల్సినవారు 1.11 లక్షల మంది
జిల్లాలో ఈకేవైసీ నమోదు ప్రక్రియ చేపట్టాం. ప్రస్తుతం అన్ని మండలాల్లోనూ ముమ్మరంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సమస్య వల్ల నెమ్మదిగా జరుగుతోంది. నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరగా ఈకేవైసీని పూర్తి చేస్తాం.
– విద్యాచందన, డీఆర్‌డీఓ
గత నెల 24 నుంచి జిల్లాలోని 471 గ్రామాల్లో కూలీల ఈకేవైసీ ప్రక్రియను ఉపాధి హామీ సిబ్బంది చేపడుతున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో మొత్తం 2,023 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, ఇందులో 1.31 లక్షల యాక్టీవ్ జాబ్ కార్డులు ఉన్నాయి. మొత్తం కూలీల సంఖ్య 4.58 లక్షల ఉండగా, యాక్టీవ్ కూలీలు 2,21,051 మంది ఉన్నారు. వీరి వివరాలను ఈ యాప్ ద్వారా నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 1,09,597 మంది కూలీల వివరాలను ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది యాప్‌లో నమోదు చేశారు. ఇంకా 1,11,454 మంది కూలీల వివరాలను నమోదు చేయాల్సి ఉంది.

ఉపాధిలో ఈకేవైసీ

ఉపాధిలో ఈకేవైసీ