
దీపావళికై నా వెలుగు నిండేనా?
● ఈ పండుగ పూట కూడా పస్తులేనా? ● గెస్ట్ లెక్చరర్ల వేతనాలపై పట్టించుకోని పాలకులు, అధికారులు
టేకులపల్లి: పాలకుల పట్టింపు లేక, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల గెస్ట్ లెక్చరర్లు పండుగ పూట కూడా పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నో ఆశలతో గెస్ట్ లెక్చరర్లుగా చేరి రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల బాధలు వర్ణనాతీతం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ అధ్యాపకులు పనిచేస్తుండగా ఇటీవల చేపట్టిన నియామకాల్లో రెగ్యులర్ అధ్యాపకులు నియమితులు కావడంతో 1,200 మంది గెస్ట్ లెక్చరర్లు ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 54 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తుండగా ఈ విద్యా సంవత్సరం నియామకాల కారణంగా 24 మంది ఇంటిబాట పట్టారు. వీరికి డిసెంబర్ 15 నుంచి మార్చి 31 వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. వీరితో పాటు కాలేజీల్లో కొనసాగుతున్న గెస్ట్ లెక్చరర్లకు కూడా వేతనాలు లేవు. పెండింగ్ వేతనాలు విడుదల కాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అప్పులు చేసి జీవనం సాగిస్తున్నట్లు పలువురు వాపోయారు. గెస్ట్ అధ్యాపకులకు పీరియడ్‌కు రూ.390 చొప్పున నెలకు 72 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. నెలలో 72 పీరియడ్లు బోధిస్తేనే రూ.28,080 వేతనం వస్తుంది. ఇది కూడా నెలనెలా రాదు. మూడు నాలుగు నెలలకు ఒకసారి వేతనాలు ఇచ్చేవారు. అసలే చాలీచాలని వేతనం, ఆపై ఆలస్యంగా వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. దసరా పండుగకు వేతనాలు వస్తాయని ఎదురు చూసినా వారికి నిరాశ ఎదురైంది. కనీసం దీపావళికై నా పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని గెస్ట్ అధ్యాపకులు కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహించాం. రెగ్యులర్ లెక్చరర్లు రావడంతో మాకు పని లేకుండా పోయింది. చేసిన పనికి సంబంధించి 2024 డిసెంబర్ 15 నుంచి మార్చి 31 వరకు వేతనం నేటికీ ఇవ్వలేదు. దసరా పండుగ సమయంలోనూ రాలేదు. కనీసం దీపావళికై నా వేతనాలు వస్తాయని ఎదురు చూస్తున్నాం. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ వేతనాలు ఇచ్చేలా కృషి చేయాలి.
– బాదావత్ రంజిత్‌కుమార్, టేకులపల్లి

దీపావళికై నా వెలుగు నిండేనా?