
అంతర్ కళాశాలల టోర్నీలో జయకేతనం
సూపర్‌బజార్(కొత్తగూడెం): వరంగల్ జిల్లా బొల్లికుంటలోని వాగ్దేవి కాలేజీలో ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహించిన మహిళల అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని 100 కళాశాలల విద్యార్థులు పాల్గొనగా, సింగరేణి కళాశాల విద్యార్థినులు వివిధ విభాగాల్లో పతకాలు సాధించడమే కాక ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కించుకున్నారు. వివిధ అంశాల్లో ఎం.ఇందు, ఎం.సంగీత, ఎం.సింధు, కుమారి, డి.పూజిత విజేతలుగా నిలిచారు. అలాగే, బెంగళూరులో జరగనున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ స్థాయి టోర్నీకి పలువురు ఎంపికయ్యారు. విద్యార్థినులను సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పొట్రుతో పాటు కాలేజీ అధ్యాపకులు డాక్టర్ కె.సావిత్రి, డాక్టర్ కె.రాజ్యలక్ష్మి తదితరులు మంగవారం అభినందించారు.