వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు

Oct 13 2025 7:24 AM | Updated on Oct 13 2025 7:24 AM

వేతన

వేతన వెతలు

● మధ్యాహ్న భోజన కార్మికులకు అందని జీతాలు ● కోడి గుడ్లు, వంట బిల్లులు కూడా పెండింగ్‌లోనే ● పలుమార్లు విన్నవించినా పట్టించుకోని ప్రభుత్వం

ఆందోళనలు నిర్వహిస్తాం

● మధ్యాహ్న భోజన కార్మికులకు అందని జీతాలు ● కోడి గుడ్లు, వంట బిల్లులు కూడా పెండింగ్‌లోనే ● పలుమార్లు విన్నవించినా పట్టించుకోని ప్రభుత్వం

కొత్తగూడెంఅర్బన్‌: బిల్లులు, వేతనాలు రాక ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. దసరా పండుగ వేళ వేతనాలు, బిల్లులు వస్తాయని ఆశ పడిన వారికి నిరాశే మిగిలింది. కనీసం దీపావళి పండుగ లోపైనా విడుదల చేస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2,150 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నారు. వీరికి చాలీచాలని వేతనం నెలకు రూ.3 వేలు ఇస్తుండగా, అది కూడా సక్రమంగా విడుదల చేయడంలేదు. వంట బిల్లులు, ఎగ్‌ బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో కూరగాయలు, గుడ్లు అప్పు చేసి కొంటున్నామని కార్మికులు వాపోతున్నారు. విద్యార్థులకు వారానికి మూడు కోడి గుడ్లను ఇవ్వాల్సి ఉండగా, బిల్లులు సకాలంలో రాకపోవడంతో చాలా పాఠశాలల్లో కోడి గుడ్లను అందించడంలేదు. దీంతో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.

జూన్‌ నుంచి వేతనాలు రాట్లే..

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కార్మికుల వేతనాలు విడుదల కావడం లేదు. వంట బిల్లులు గత మార్చి నుంచి ఇవ్వడంలేదు. కోడి గుడ్ల బ్లిలులు కూడా గత జూన్‌ నుంచి చెల్లించాల్సి ఉంది. గుడ్డుకు ప్రభుత్వం రూ.6 చొప్పున చెల్లిస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర ఉంటోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో రూ.7, ఏజెన్సీ ప్రాంతం, మారుమూల ప్రాంతాల్లో రూ.8 వరకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులపై భారం పడుతోంది.

పోరాటానికి సిద్ధం

వేతనాలు, బిల్లులు విడుదల చేయాలని కోరుతూ డీఈఓ, జిల్లా అధికారులకు మధ్యాహ్న భోజన కార్మికులు వినతులు అందజేశారు. గత 10వ తేదీలోగా వేతనాలు, బిల్లులు వచ్చే విధంగా చూస్తామని అధికారులు హామీ ఇచ్చినా విడుదల కాలేదు. దీంతో కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నిరసన దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మధ్యాహ్న భోజన కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వేతనాలు, బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు, బిల్లులు నెలల తరబడిగా పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల పండుగ రోజుల్లో కూడా అవస్థలు పడాల్సివస్తోంది. అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం 10న బిల్లులు విడుదల కాలేదు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన

తెలుపుతాం.

–సత్తెనపల్లి విజయలక్ష్మి, మిడ్డే మీల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి

వేతన వెతలు1
1/1

వేతన వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement