
శ్రీ మహిషాసురమర్దినిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారు.. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీహోమం, లక్షకుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. కాగా, విజయదశమి పండుగ రోజైన గురువారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల ఖాతాల్లో బోనస్
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ వారి ఖాతాల్లో జమ చేశారు. ‘కార్మికులకు అందని లాభాల వాటా’ శీర్షికన మంగళవారం సాక్షిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 చొప్పున ప్రకటించినా.. కాంట్రాక్టర్లు వారికి విధించే జీఎస్టీ, ఇన్‌కమ్ టాక్స్‌ను కూడా కలిపి పేమెంట్ చేస్తేనే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా చెల్లిస్తామని భీష్మించారు. దీంతో స్పందించిన యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో కాంట్రాక్టర్లు కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఇదిలా ఉండగా సివిల్ విభాగంలో 80 శాతం చెల్లించగా, కార్పొరేట్ ఆస్పత్రి, మరికొన్ని విభాగాలతో పాటు, ఇల్లెందు ఏరియాలో అసలే బోనస్ జమ కాలేదు. కార్మికుల వివరాలను కాంట్రాక్టర్లు యాజమాన్యానికి సమర్పించనందున లాభాల బోనస్ నిలిచిపోయిసట్లు సమాచారం.
నేటి నుంచి వన్యప్రాణి వారోత్సవాలు
పాల్వంచరూరల్ : వన్యప్రాణి వారోత్సవాలు గురువారం నుంచి ఈనెల 10 వరకు నిర్వహించనున్నట్లు వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ కేంద్రంతో పాటు కిన్నెరసానిలో ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఏజెన్సీ గ్రామాల్లో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
డీపీఓగా బాధ్యతల స్వీకరణ
చుంచుపల్లి: జిల్లా పంచాయతీ అధికారిగా టి.రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ డీపీఓగా పనిచేసిన వి.చంద్రమౌళి గత నెల 30న ఉద్యోగ విరమణ పొందగా ఖమ్మంలో డీఎల్‌పీఓగా పనిచేస్తున్న రాంబాబును డీపీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టగా కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.
‘ఆది కర్మయోగి అభియాన్’ను అమలు చేయాలి
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద గిరిజన గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరిచాలని సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ విభునాయర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం వీడియో, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలవారీగా ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలతోపాటు ప్రతి గ్రామ పంచాయతీలో ఆదిశైవా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు. గ్రామంలోని సమస్యలతో పాటు ఇంటింటికీ తిరిగి, కుటుంబాల సమస్యలను తెలుసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కాగా, పథకంలో భాగంగా ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లో 130 గ్రామ పంచాయతీల్లో ప్రణాళికలు రూపొందించి పోర్టల్‌లో పొందుపరిచామని ఏపీఓ డేవిడ్‌రాజ్ తెలిపారు. కార్యక్రమంలో సున్నం రాంబాబు, సిబ్బంది కార్తీక్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.