
‘సేంద్రియ’ కూరగాయలే వినియోగించాలి
గర్భిణులు, చిన్నారులకు వాటితోనే మేలు
కలెక్టర్ జితేష్ వి పాటిల్
తోగ్గూడెం అంగన్‌వాడీ కేంద్రం సందర్శన
పాల్వంచరూరల్ : అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని, తద్వారా సేంద్రియ ఎరువులు వినియోగించి కూరగాయలు, ఆకుకూరలను పండించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఆయా కేంద్రాలకు వచ్చే గర్భిణులు, చిన్నారులకు వాటినే పోషకాహారంగా అందించాలని అంగన్‌వాడీ టీచర్లను ఆదేశించారు. మండల పరిధిలోని తోగ్గూడెం తండా అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సాక్ష్యం అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా పోషణ్ వాటిక ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. తక్కువ స్థలంలో పందిళ్ల ద్వారా ఎక్కువ కూరగాయలు పండించే అవకాశం ఉందన్నారు. పశువుల ఎరువులను మాత్రమే వినియోగించి ఆకుకూరలు, కూరగాయలు పండించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు ప్రతీ రోజు అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి భోజనాలు చేస్తున్నారా, చిన్నారులు బాలామృతాన్ని ఇష్టంగా తింటున్నారా అని ఆరా తీశారు.
కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు..
తండాలోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, అర్హత కలిగిన కొంత మంది గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, గతంలో మంజూరై రద్దయిన లబ్ధిదారులకు తిరిగి ఇళ్లు కేటాయించాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. కొందరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు రాలేదని, మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ముగిసిన తర్వాత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డి, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, ఎంపీఓ చెన్నకేశవులు, ఏపీఓ పొరండ్ల రంగా తదితరులు పాల్గొన్నారు.