
మద్యానికి దూరంగా గోపన్నగూడెం
● ఏడేళ్లుగా పాటిస్తున్న గిరిజన పల్లె ● ఆదర్శంగా నిలుస్తున్న గ్రామస్తులు
అశ్వారావుపేటరూరల్: మహాత్మాగాంధీ ఆశయాన్ని ఓ గిరిజన పల్లె వాసులు ఏడేళ్లుగా పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన మహిళళలు మద్యపాన నిషేధంపై ఉద్యమించి, గ్రామంలో మద్యం విక్రయించొద్దని, ఎవరూ ముట్టవద్దని తీర్మానించగా నేటికీ ఆ కట్టుబాటును పాటించడం విశేషం. నేడు గాంధీ జయంతి సందర్భంగా ఆ పల్లైపె కథనం..
అశ్వారావుపేట మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గోపన్నగూడెం అనే గిరిజన పల్లె ఉంది. ఈ గ్రామంలో 108 కుటుంబాలకు చెందిన 260 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం గిరిజనులే కాగా, అందరూ వ్యవసాయం, కూలీ పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 2018కి ముందు గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయాలతోపాటు గుడుంబా తయారీ, విక్రయాలు సాగేవి. దీంతో నిత్యం మద్యం మత్తులో గొడవలు జరిగేవి. ఈ గొడవలు, వివాదాలతో అగ్రహించిన మహిళలు బెల్ట్ దుకాణాలు, సారా విక్రయాలపై ఉద్యమించారు. ఈ నేపథ్యంలో అప్పటి కన్నాయిగూడెం సర్పంచ్ గొంది లక్ష్మణరావు ఆధ్వర్యంలో.. తమ గ్రామంలో మద్యం, సారా విక్రయాలు చేయొద్దని గ్రామస్తులు తీర్మానించారు. నాటి నుంచి ఆ గ్రామంలో బెల్ట్ దుకాణాలు, సారా విక్రయాలు నిలిచిపోగా ఏడేళ్లుగా ప్రజలంతా మద్యానికి దూరంగా ఉంటున్నారు. దీంతో మద్యం రహిత గ్రామంగా ఈ పల్లె ఇతర గ్రామాలకూ ఆదర్శంగా మారింది.
మద్యం, సారా విక్రయం, సేవించడంతో గ్రామంలో ఎన్నో గొడవలు జరిగాయి. దీంతో గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని మహిళలు నిర్ణయించి నా దృష్టికి తీసుకొచ్చారు. గ్రామస్తుల సహకారంతో మద్యానికి దూరంగా ఉండాలని తీర్మానించి గత ఏడేళ్లుగా అమలు చేస్తున్నాం. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో చాలా మంది మద్యానికి బానిస కావడం లేదు. నిషేధించిన తర్వాత గ్రామంలో గొడవలు సద్దుమణిగి ప్రశాంతత నెలకొంది.
– గొంది లక్ష్మణరావు, మాజీ సర్పంచ్

మద్యానికి దూరంగా గోపన్నగూడెం