
జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షకే ప్రాధాన్యం
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి తుమ్మల
సూపర్‌బజార్(కొత్తగూడెం): అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ప్రధానంగా ఖనిజసంపద, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో అగ్రగామిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మొదట సింగరేణి అతిథి గృహంలో మంత్రికి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులు, ప్రజాపోరాట యోధుల త్యాగాల వల్లే నేడు ప్రజాస్వామ్య విలువలు స్థిరపడ్డాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలేపాలకులని, ప్రజలే అధిపతులు అనే స్ఫూర్తిని ప్రజాపాలన దినోత్సవం గుర్తు చేస్తోందని అన్నారు. విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఉపాధి, సంక్షేమరంగాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలతో రైతు సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్‌గా నిలిచిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు కల నెరవేరిందని, దేశంలోనే తొలిసారిగా జిల్లాలో ఎర్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.
భద్రాచలం రైల్వే లైన్‌కు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. అడ్డంకులను తొలగించి కలెక్టర్ సూచించిన ప్రాంతంలో విమానాశ్రయం నిర్మిస్తామని తెలిపారు. రింగ్‌రోడ్డు, బైపాస్‌రోడ్డు, నేషనల్‌హైవే పనులు కూడా పురోగతిలో ఉన్నాయని వివరించారు. సింగరేణి సంస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులు మిర్చి, పత్తి వంటి పంటలను తగ్గంచి లాభదాయకమైన ఉద్యాన పంటల వేయాలని సూచించారు. దేశంలోనే జిల్లా ఆయిల్‌పామ్ హబ్‌గా మారుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాల మంత్రులు జిల్లాలో జరుగుతున్న ఆయిల్‌పామ్ సాగు గురించి తెలుసుకుంటున్నారని వివరించారు. సిద్ధిపేటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్, జిల్లా అటవీశాఖాధికారి కృష్ణాగౌడ్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి
కలెక్టరేట్‌లో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, నాగ సీతారాములు, కాపర్తి వెంకటాచారి, వారాధి సత్యనారాయణ, బసవపాత్రుని తిరుపతి, వారాధి రామాచారి, బి.సాంబయ్య, ఎస్.కృష్ణమాచారి, కూరపాటి లింగాచారి, పి.వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజాపాలన’తో సమానత్వం, న్యాయం: ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: ప్రజాభిప్రాయాలు, ఆకాంక్షలు, సమస్యలను గుర్తించి సరైన పరిష్కారం చూపి, సమాజాన్ని సమానత్వం, న్యాయం అభివృద్ధి దిశగా నడిపించడమే ప్రజాపాలన ఉద్దేశమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన పతాకావిష్కరణ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పతాక ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ సెప్టెంబర్ 17తో నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, మణెమ్మ, సున్నం రాంబాబు, భాస్కరన్, హరీష్, ఉదయ్ కుమార్, అశోక్ కుమార్,ఆదినారాయణ, ప్రభాకర్ రావు, హరికృష్ణ, చలపతి, బిక్షం తదితరులు పాల్గొన్నారు.