మరో సర్వేకు అడుగులు | - | Sakshi
Sakshi News home page

మరో సర్వేకు అడుగులు

Sep 18 2025 7:07 AM | Updated on Sep 18 2025 7:07 AM

మరో సర్వేకు అడుగులు

మరో సర్వేకు అడుగులు

ఎయిర్‌పోర్టు కోసం పట్టువిడవకుండా ప్రయత్నిస్తున్న మంత్రి తుమ్మల

కొత్తగూడెంలో ఎదురవుతున్న సాంకేతిక చిక్కులు

కొత్తగూడెం–భద్రాచలం మధ్య కొత్త స్థలాల పరిశీలన

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్‌తోపాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. కొత్తగూడెంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులో చిన్న విమానాలతోపాటు ఎయిర్‌బస్‌ వంటి భారీ విమానాలు ల్యాండింగ్‌, టేకాఫ్‌ తీసుకునేందుకు వీలుగా మూడు కిలోమీటర్ల పొడవైన రన్‌వే నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 950 ఎకరాల భూమి అవసరమని భావించారు. కొత్తగూడెం మండల పరిధిలోని రామవరం, గరీభ్‌పేట శివారులలో 707, సుజాతనగర్‌ మండల పరిధిలో 195, చుంచుపల్లి మండల పరిధిలో 50 ఎకరాల స్థలాలను కూడా గుర్తించారు. ఇక్కడున్న ఎత్తైన గుట్టలు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా నిలిచాయి. మరోవైపు వరంగల్‌, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుల విషయంలో సానుకూల ఫలితాలు వచ్చి క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. దీంతో సెప్టెంబరు 16న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడికి కొత్తగూడెం ఎయిర్‌పోర్టు కోసం విజ్ఞప్తి చేయగా.. మరోసారి ఫీజుబులిటీ సర్వేకు అడుగులు పడ్డాయి.

ఇరవై ఏళ్లుగాఽ అదే సమస్య

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మించాలనే అంశంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన స్థలాన్ని ఎంపిక చేయడమే సవాల్‌గా మారింది. భవిష్యత్‌లో బోయింగ్‌ విమానాలు దిగేందుకు వీలుగా వెయ్యి ఎకరాల్లో ఎయిర్‌పోర్టు కోసం సుజాతనగర్‌ ప్రాంతంలో భూములు వెతికారు. అయితే అది సాధ్యపడలేదు. చివరకు ఎయిర్‌కార్గో సేవల కోసం ప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక ఆ తర్వాత పాల్వంచ మండలం గుడిపాడు – బంగారుజాలల మధ్య ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. పాల్వంచ పట్టణాన్ని అనుకుని ఉన్న ఎత్తైన గుట్టలు, కేటీపీఎస్‌ చిమ్నీలు, కూలింగ్‌ టవర్ల వల్ల సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఈ ప్రతిపాదన అక్కడే ఆగిపోయింది.

కొత్తగూడెం – భద్రాచలం మధ్య..

ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సుజాతనగర్‌, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో ఎన్నిసార్లు స్థలాలను గుర్తించినా ఎత్తైన కొండలు, అభయారణ్యం, హై టెన్షన్‌ కరెంటు లైన్లు, రైల్వే మార్గాలు, నేల స్వభావం, గాలుల తీవ్రత, నీటి ప్రవాహాలు వంటి భౌగోళిక, సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ మండలాలను మినహాయించి భద్రాచలం – కొత్తగూడెం మధ్య ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాలను పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు సైతం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రెండు మూడు చోట్ల స్థలాలను గుర్తించగా, ఇందులో ఒక స్థలాన్ని ఎయిర్‌పోర్టు కోసం ఫైనల్‌ చేయనున్నట్టు సమాచారం.

ఎంతో ఉపయుక్తం

జిల్లాలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే దేశం నలుమూలల నుంచి భద్రాచలం క్షేత్రానికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. సింగరేణి గనులు, హెవీ వాటర్‌ ప్లాంట్‌, ఐటీసీ, కేటీపీఎస్‌, బీటీపీఎస్‌ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా మెడికల్‌ కాలేజీ, డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటైంది. దేశం మొత్తం మీద ఎర్త్‌ సైన్సెస్‌ విభాగంలో ప్రత్యేక కోర్సులు అందిస్తున్న వర్సిటీగా ఇది నిలిచింది. త్వరలోనే సేంద్రియ సాగు విధానానికి సంబంధించి ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ కూడా జిల్లాకు రానుంది. మరోవైపు అడవులు విస్తారంగా ఉండటంతో ఎకో టూరిజానికి ఈ ప్రాంతం అనువుగా ఉంది. ఇప్పటికే ఎకో టూరిజంలో ప్రసిద్ధి చెందిన మారేడుమిల్లి, పాపికొండలు, సీలేరు – పొల్లూరు వాటర్‌ఫాల్స్‌ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు భద్రాచలం గేట్‌వేగా ఉంది. ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలు ఈ ప్రాంతంలో పుంజుకుంటాయి. సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఆస్కారముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement