
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారి నిత్యకల్యాణ వేడుక కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (పునర్వసు)ని పురస్కరించుకుని భక్తరామదాసు ట్రస్ట్ (కొత్తగూడెం) నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం భద్రగిరి ప్రదక్షిణా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రామయ్య కృపాకటాక్షాలకు గిరిప్రదక్షిణానే మార్గంగా ప్రతి నెలా పునర్వసు రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అధికారులు గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి, ప్రసాదం అంజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్, సీసీ శ్రీనివాస రెడ్డి, పీఆర్‌ఓ సాయిబాబు, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు రామభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గొత్తికోయల
వలసగూడెం ఖాళీ..
అటవీ సిబ్బంది కృషితో
అడవిని వీడేందుకు అంగీకారం
చుంచుపల్లి: కొత్తగూడెం డివిజన్ అటవీ సిబ్బంది సమష్టి కృషితో బుధవారం గొత్తికోయల వలసగూడెం వాసులు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు. సత్యంపేట బీట్ పరిధిలో 18 కిలోమీటర్ల మేర మాస్ కూంబింగ్–ఫారెస్ట్ మార్చ్ విజయవంతంగా నిర్వహించారు. 2018లో అటవీలో ఏర్పడిన మామిడిగూడెం గొత్తికోయల వలసగూడెంలోని సుమారు 45 కుటుంబాలు దాదాపు 45 ఇళ్లను, పశువుల కొట్టాలను ఏర్పాటు చేసుకున్నాయి. గతేడాది నుంచి నిరంతరంగా జరిగిన సమావేశాల ఫలితంగా చివరికి వారు అటవీ బయటకు వెళ్లేందుకు అంగీకరించారు. అటవీ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా వారంలోగా గ్రామం పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉందని ఎఫ్‌డీఓ యూ.కోటేశ్వరరావు తెలిపారు.
కొత్తగూడెం వాసికి డాక్టరేట్
కొత్తగూడెంఅర్బన్: పట్టణంలోని ఎస్‌ఆర్ డిజీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దోర్బల లక్ష్మీఅనురాధకు ఏపీలోని నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ‘పర్సెప్షన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆన్‌ది ఫంక్షనింగ్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్’ అనే అంశంపై డాక్టర్ గోగినేని యశోద పర్యవేక్షణలో ఆమె పరిశోధనాపత్రం సమర్పించారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా అనురాధను పాఠశాల యాజమాన్యం లక్ష్మణరావు, సతీష్, తిరుమల్‌రెడ్డి, రామారావు అభినందించారు.

కమనీయంగా రామయ్య కల్యాణం