
ఉన్నత లక్ష్యాలతో రాణించాలి
దమ్మపేట/ములకలపల్లి : ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో రాణించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఆయన ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో పర్యటించారు. దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన డార్మెటరీ భవనాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రారంభించారు. అదే పాఠశాలలో రూ.8 కోట్ల 60 లక్షలతో నిర్మించనున్న బాలుర హాస్టల్, ఉద్యోగుల క్వార్టర్ల భవనాల శంకుస్థాపన నిమిత్తం ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అడ్వెంట విత్తన కంపెనీ ఆర్థికసాయంతో రూ.46 లక్షలతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్‌ను, రూ.21 లక్షలతో గండుగులపల్లిలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి తుమ్మల మధ్యాహ్న భోజనం చేశారు. తొలుత స్థానిక మంగపేట పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించి, దేశంలోని ఏకలవ్య పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని విద్యార్థినులకు సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఏర్పాటు చేయాలని వైద్య శాఖాధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు, శాస్త్రవేత్తలుగా కూడా ఎదగాలని, ప్రధానంగా భూ, జల, వ్యవసాయ రంగాల్లో రాణించాలని సూచించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు అద్భుత అవకాశాలు దక్కుతాయన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ దసరా సెలవుల్లోగా అన్ని పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళలదే ప్రధాన పాత్ర పేర్కొన్నారు. ఐటీడీఏ పీఓ గౌతమ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఆర్‌డీఓ విద్యాచందన, డీఎంఅండ్‌హెచ్‌ఓ జయలక్ష్మి, తహసీల్దార్ గనియా నాయక్, ఎంపీడీఓ రామారావు, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, తాండ్ర ప్రభాకర్‌రావు, పర్వతనేని అమర్‌నాథ్, పువ్వాల మంగపతి, కరుటూరి కృష్ణ, అడపా నాగేశ్వరరావు, బాల అప్పారావు, కారం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు