
స్వచ్ఛతా హీ సేవా పోస్టర్ ఆవిష్కరణ
చుంచుపల్లి: స్వచ్ఛతా హీ సేవా–2025 పోస్టర్‌ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో స్వచ్ఛ శ్రామికులకు ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛత ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన, నాటక, ఇతర పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన, సిబ్బంది రేవతి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ విద్యా విధానంతో
సులభంగా నేర్చుకోవచ్చు
సూపర్‌బజార్(కొత్తగూడెం): డిజిటల్ విద్యావిధానంతో విద్యార్థులు సులభంగా నేర్చుకోవచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో బుధవారం ఎనిమిది ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, రెండు భవిత సెంటర్ల ఐఈఆర్‌పీలకు సీఎస్‌ఆర్ పాలసీ ద్వారా హైదరాబాద్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యాజమాన్యం క్యాన్ ప్రొజెక్టర్ (డిజిటల్ బోధనా పరికరాలు)లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రూ.25 లక్షల విలువైన భోధనా పరికరాలను అందజేసినందుకు అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో జిల్లాలో 250 పాఠశాలలకు కూడా మంజూరు చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. బీఈఎల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డీఈఓ బి.నాగలక్ష్మి, విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్‌కుమార్, సైదులు, నాగరాజశేఖర్, బీఈఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.