
నేటి నుంచి పోషణ్ అభియాన్
విజయవంతం చేస్తాం..
మాతా, శిశు సంరక్షణే లక్ష్యంగా మాసోత్సవాలు
● గర్భిణులు, బాలింతులు, కిశోర బాలికల ఆరోగ్యంపై అవగాహన సదస్సులు ● అంగన్‌వాడీ కేంద్రాల్లో నెల పాటు కార్యక్రమాలు
చర్ల: సమగ్ర పోషకాహార పరిరక్షణ ద్వారా ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 30 రోజుల పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషన్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా, బుధవారం నుంచి అక్టోబర్ 16 వరకు జిల్లావ్యాప్తంగా నెల రోజుల పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఐసీడీఎస్ ఇతర శాఖలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిర్వహించే ఈ కార్యక్రమాలపై మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తుంటాయి.
ప్రధాన లక్ష్యాలు..
●మాతా శిశు ఆరోగ్య పరిరక్షణ, గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల పిల్లలకు సరైన పోషకాహారం, స్వచ్ఛత వంటి అంశాలపై దృష్టి.
●మహిళలు, చిన్నారులకు ఆరోగ్యకరమైన, పోషకాలు ఉన్న ఆహారం అందించడం.
●శిశువు జననానికి ముందు, జన్మించిన తరువాత రెండేళ్ల వరకు అందించాల్సిన పోషకాహారాలపై అవగాహన కల్పించడం.
●ూసోత్సవ ప్రత్యేక అంశాలు..
●అంగన్‌వాడీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ చేపడతారు.
●పిల్లల్లో ఉన్న పోషకాహార లోపాన్ని గుర్తించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలుండే ఆకుకూరలు, కూరగాయలు స్థానికంగా దొరికే ఇతర ఆహార పదార్థాల గురించి వివరించడం.
●బాల్యంలో అధిక బరువు నివారణ, మంచి ఆహారపు అలవాట్లను గుర్తించి అలాంటి వాటికి ప్రోత్సాహకాలు అందజేయడం.
●పోషణ ప్రతిజ్ఞ, ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, గృహ సందర్శనలు, పోషణ మేళాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు.
తొలి వారం కార్యాచరణ..
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వంటల పోటీలు నిర్వహించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను ఇచ్చే వంటకాలకు బహుమతులు అందజేస్తారు. మహిళలు, బాలికలకు బీఎంఐ పరీక్షలు నిర్వహించి పిల్లలు బరువు, ఎత్తు కొలుస్తారు.
రెండో వారం..
బిడ్డకు అందించే ముర్రుపాల విశిష్టత, అనుబంధ ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లపై అవగాన సదస్సులు నిర్వహిస్తారు. పిల్లల పోషణలో తండ్రుల భాగస్వామ్యం, పుట్టిన బిడ్డ మొదటి 1000 రోజుల్లో మెదడు అభివృద్ధి చెందే విధానంపై వివరిస్తారు.
మూడో వారం..
అత్యధికంగా పోషణ లోపమున్న పిల్లల్ని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తారు. వృద్ధి పర్యవేక్షణకు హాజరు కాలేని పిల్లలను గుర్తించి వారి బరువు, ఎత్తు కొలిచేందుకు ఆశ కార్యకర్తలు వారి ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తారు.
నాలుగో వారం..
కిశోర బాలికలకు రక్తహీనత పరీక్షల నిర్వహణ, రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, తాగునీరు, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, తక్కువ చక్కెర నూనెలతో తయారు చేసే వంటకాలను ప్రదర్శిస్తారు. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాల నిర్వహణ గురించి వివరిస్తారు. పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు.
జిల్లాలో అన్ని శాఖలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పోషణ్ అభియాన్ మాసోత్సవాన్ని విజయవంతం చేస్తాం. అన్ని ప్రాజెక్టుల్లో స్థానికంగా ఉండే అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు అందించాలని ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలిచ్చాం. నెలరోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం.
– స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారిణి

నేటి నుంచి పోషణ్ అభియాన్